నిమజ్జనం వ్యూహం మజ్లిస్ దా?

Update: 2016-01-15 11:30 GMT
హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని నిలిపి వేయాలన్న ఆలోచన మజ్లిస్ దా? వినాయక విగ్రహాల నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ బదులు మరోచోట ఒక చెరువును తవ్వించాలన్న వ్యూహం కూడా దానిదేనా? మజ్లిస్ వ్యూహానికి టీఆర్ ఎస్ వంత పాడిందా? ఈ ప్రశ్నలకు ఔను అనే అంటున్నాయి టీడీపీ - బీజేపీ వర్గాలు. అయితే, నిమజ్జనం ఆలోచనపై కొన్ని వర్గాల నుంచి సానుకూలత వ్యక్తమవుతుంటే, మరికొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

నాగార్జున సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా.. హిందూ అనుకూలురు మాత్రం దానినే సమర్థిస్తున్నారు. నిమజ్జనానికి మరో అవకాశం లేదని వాదిస్తున్నారు. ఇందిరా పార్కులో ఒక చెరువును తవ్వించినా.. అది హుస్సేన్ సాగర్ కు సాటి రాదని వారు వివరిస్తున్నారు. అయితే, హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయరాదని, అందుకు ఇందిరా పార్కులో ప్రత్యేకంగా చెరువును తవ్వుతామని గతంలో కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అది కేసీఆర్ ఆలోచన అని చాలామంది భావించారు. కానీ,అది కేసీఆర్ ఆలోచన కాదని, అది మజ్లిస్ ఆలోచన అని గ్రేటర్ ఎన్నికల సందర్భంగా బయటకు వస్తోంది. మజ్లిస్ సూచన మేరకే కేసీఆర్ ఆ ప్రకటన చేశారని టీడీపీ, బీజేపీ నాయకులు ఇప్పుడు బయట పెడుతున్నారు. దాంతో ఇటు టీఆర్ ఎస్ తోపాటు అటు మజ్లిస్ పైనా వ్యతిరేకత ప్రబలుతోంది.

మజ్లిస్ తో కలిసి టీఆర్ ఎస్ అధికారంలోకి వస్తే వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఇబ్బంది రావడంతోపాటు హైదరాబాద్ లో అభివృద్ధి కూడా కుంటుపడుతుందని వివరిస్తున్నారు. గత రెండేళ్లుగా హైదరాబాద్ లో కాంగ్రెస్ తో కలిసి మజ్లిస్ అధికారంలో ఉందని, అయినా, రోడ్లు వేయలేదని, రోడ్ల వ్యవస్థను, మంచినీటి వ్యవస్థను దారుణం చేసేసిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మజ్లిస్ కు దొరల పార్టీ కలిస్తే రాబోయే ఐదేళ్లూ హైదరాబాద్ వాసులతోపాటు ఇక్కడి సెటిలర్ల పరిస్థితి దారుణంగా ఉంటుందని టీడీపీ, బీజేపీలు ప్రచారం చేస్తున్నాయి.

Tags:    

Similar News