కేంద్రం యాప్ పై విమ‌ర్శ‌లు షురూ

Update: 2016-12-30 16:29 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. పాత నోట్లు ర‌ద్దై 50 రోజులు కావొస్తున్న స‌మ‌యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌వేశ‌పెట్టిన భీమ్ యాప్‌ పై తాజాగా మ‌మ‌త విమ‌ర్శ‌లు గుప్పించారు. రాజ్యంగ నిర్మాంత అంబేద్క‌ర్ ను స్మ‌రించుకునేలా భీమ్ పేరిట యాప్‌ ను ప్రవేశపెట్టడం ద్వారా అంబేద్కర్ తో పాటు వెనుకబడిన వర్గాలను ప్ర‌ధాని మోడీ అవమానపరిచారని మ‌మ‌త ధ్వజమెత్తారు. యాప్ ను రాజ్యంగ నిర్మాత పేరుతో తేవ‌డం ఏంట‌ని మ‌మ‌త ప్ర‌శ్నించారు.

మ‌రోవైపు రూ.500 - రూ.1000 నోట్ల ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై పోరాటం విషయంలో వెనక్కి తగ్గేది లేదని మ‌మ‌తా బెన‌ర్జీ  తేల్చిచెప్పారు. అవసరమైతే తమ పార్టీ ఎంపీలు - ఎమ్మెల్యేలందర్నీ నోటీసులు లేకుండా అరెస్టు చేయండని బ‌హిరంగ స‌వాల్ విసిరారు. అరెస్టులకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పెరల్ గ్రూప్ చిట్‌ ఫండ్ స్కాంతో(రూ. 50 వేల కోట్లు) బీజేపీకి సంబంధముందని మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపించారు. సీబీఐ వాళ్లు తమను అరెస్టు చేసిన నోట్ల రద్దుపై నిరసన కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. నగదు విత్‌ డ్రా విషయంలో కేంద్రం నిబంధనలు ఎత్తివేస్తుందని ఆశిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

ఇదిలాఉండ‌గా...నోట్ల రద్దు - ప్రధాని మోడీ అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఆందోళనలు మూడు దశలుగా చేయాలని నిర్ణయించింది. మొదటిదశలో వచ్చే ఏడాది జనవరి 6వతేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నది. ఈ మేరకు ఆ పార్టీ సమాచార విభాగం ఇన్‌ చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు. మోడీ గుజరాత్ సీఎంగా పనిచేసిన సమయంలో సహారా - బిర్లా సంస్థల నుంచి రూ. 65 కోట్ల ముడుపులు తీసుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయా సంస్థల నుంచి మోడీ డబ్బులు తీసుకున్నారా..? లేదా సమాధానం చెప్పాలని సుర్జేవాలా డిమాండ్ చేశారు. దీనిపై సత్వంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతున్నామని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News