బేగంపేట పోలీస్ స్టేష‌న్లో ఆరుగుర్ని పొడిచేశాడు!

Update: 2018-10-19 04:50 GMT
స‌మ‌స్య‌లు ఏమైనా ఎదురైతే అంద‌రికి ముందుగా గుర్తుకు వ‌చ్చేసేది పోలీస్ స్టేష‌న్. అలాంటి స్టేష‌న్లోనే స‌మ‌స్య‌ను సృష్టించిన షాకింగ్ వైనం తాజాగా చోటు చేసుకుంది. అచ్చం సినిమా సీన్ ను త‌ల‌పించేలా చోటు చేసుకున్న ఈ రియ‌ల్ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు పోలీస్ స్టేష‌న్ కు ప‌రిగెత్తుకు రావ‌టం మామూలే. అయితే.. ఇలా ప‌రిగెత్తుకు వ‌చ్చిన మ‌హిళ పైనా.. ఆమె త‌ల్లిదండ్రులు.. బంధువుల‌పై క‌త్తితో క‌స‌క‌సా పొడిచేయ‌టం ఊహించ‌గ‌లమా?  వినేందుకే షాకింగ్ గా ఉన్న ఈ ఉదంతం తాజాగా సికింద్రాబాద్ ప‌రిధిలోని బేగంపేట మ‌హిళా పోలీస్ స్టేష‌న్లో  చోటు చేసుకుంది.

కొబ్బ‌రిబొండాం క‌త్తితో ఈ మ‌ధ్య‌న విరుచుకుప‌డుతున్న ఉన్మాదుల‌కు త‌గ్గ‌ట్లే తాజాగా ఈ ఉదంతం చోటు చేసుకుంది. బేగంపేట‌కు చెందిన ఒక వ్య‌క్తి భార్య‌తో గొడ‌వ ప‌డుతున్నారు. దీంతో.. అత‌డి మీద భార్య‌.. ఆమె త‌ల్లిదండ్రులు పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు. దీంతో.. అత‌డ్ని పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. తాజాగా అత‌డితో పాటు.. భార్య‌కు.. అత్త‌మామ‌ల‌కు.. మ‌రో ఇద్ద‌రికి కౌన్సెలింగ్ కు ఇచ్చేందుకు స్టేష‌న్ కు పిలిచారు.

ఇదిలా ఉండ‌గా.. కౌన్సెలింగ్ కోసం స్టేష‌న్లో ఉన్న వారిపైన భ‌ర్త కొబ్బ‌రికాయ‌ల క‌త్తిని తీసుకొచ్చి.. ఆరుగురిపైనా కత్తితో పోట్లు వేశాడు. పోలీస్ స్టేష‌న్లో.. పోలీసుల ఎదుర‌ట జ‌రిగిన ఈ ఉదంతంలో కొన్ని క్ష‌ణాలు షాక్ కు గురైన సిబ్బంది.. ఆ వెంట‌నే రియాక్ట్ అయి..అత‌డ్ని అదుపులోకి తీసుకున్నారు. గాయ‌ప‌డిన వారిని వెంట‌నే గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఉన్మాదిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు. స్టేషన్లోనే కొబ్బ‌రిబొండాం క‌త్తితో చెల‌రేగిపోయిన ఈ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
Tags:    

Similar News