స్మార్టు ఫోన్ తో అక్రమ సంబంధం

Update: 2016-06-30 07:24 GMT
స్మార్టు ఫోన్లకు అడిక్టయిపోయి సంసారాన్ని కూడా మర్చిపోతున్న వారి సంఖ్య పెరిగిపోయిందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో స్మార్టు ఫోన్ పిచ్చి ప్రజల్లో పీక్ స్టేజికి చేరిందనడానికి ఉదాహరణగా ఓ వ్యక్తి నిర్ణయం తీసుకున్నాడు. స్మార్టు ఫోనే తన ప్రపంచమంటూ.. అదే తన సర్వస్వమంటూ దాంతోనే ప్రేమలో పడ్డాడు.  తన ఫోన్ ను వదిలి ఉండలేనంటూ ఏకంగా దాన్నే పెళ్లాడాడు. స్మార్టుఫోన్ ను సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నాడు.

అమెరికాలోని లాస్ వెగాస్ లో జరిగిన ఈ ఘటన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. అరోన్ చర్వెనాక్ అనే వ్యక్తి తన ఫోన్ తో విపరీతమైన అనుబంధం పెంచుకున్నాడు.  దాన్నే తన జీవిత భాగస్వామి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంకేముంది చర్చికి వెళ్లి తమ ఇద్దరికీ పెళ్లి చేయాలని కోరాడు. మత పెద్ద కూడా అందుకు ఓకే అని సంప్రదాయబద్ధంగా తంతు నిర్వహించాడు. "ఆరోన్ అనే నువ్వు - ఈ స్మార్ట్ ఫోన్ ను నీ భార్యగా అంగీకరిస్తున్నావా? నువ్వు దానిపై ప్రేమను - ఆప్యాయతను చూపుతూ సంతోషంగా ఉంచగలవా? " అని ప్రశ్నించగా... దానికి అరోన్ 'అవును' అని సమాధానం చెప్పాడట. ఇంకేముంది... అరోన్ కు - స్మార్టు ఫోన్ కు మతపెద్ద పెళ్లి జరిపించేశాడు.

కాగా అరోన్ తనకు స్మార్టు ఫోన్ తో పెళ్లి చేయాలని వచ్చి కోరగా తొలుత షాక్ తిన్నానని.. కానీ, ఆయన కోరిక కాదనలేక వివాహం జరిపించానని ఆ మత పెద్ద చెబుతున్నారు.  ప్రజలు స్మార్ట్ ఫోన్ తో ఎంతగా మమేకం అవుతున్నారనడానికి ఇది తాజా ఉదాహరణని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఈ వివాహాన్ని చట్టబద్ధత లేదని అమెరికా అధికారులు ప్రకటించారు. అధికారికం కాకపోవడంతో దీన్ని అక్రమ సంబంధంగా పేర్కొంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Tags:    

Similar News