హైద‌రాబాద్ హైకోర్టులో జ‌డ్జినే బెదిరించాడు

Update: 2017-10-13 05:47 GMT
ఆవేశం.. ఆగ్ర‌హం హ‌ద్దులు దాట‌కూడ‌దు. అడిగే విష‌యంలో ధ‌ర్మం ఉన్నా.. అడుగుతున్న తీరులో తేడా ఉంటే చ‌ట్ట‌బ‌ద్ధంగా తిప్ప‌లు త‌ప్ప‌వు.  ఎక్క‌డ ఎలా అడ‌గాల‌న్న విష‌యం మీద లోపించిన అవ‌గాహ‌న‌.. తొంద‌ర‌పాటు మ‌రో కొత్త చిక్కును మీదేసిన వైనం తాజాగా ఉమ్మ‌డి హైకోర్టులో ఒక వ్య‌క్తికి ఎదురైంది. కేసు విచార‌ణ ఆల‌స్య‌మ‌వుతుంద‌న్న ఆగ్ర‌హం శృతి మించి ఓ వ్య‌క్తి త‌న కేసును అత్య‌వ‌స‌రంగా విచారించాల‌ని లేదంటే ఉరి వేసుకుంటాన‌ని కోర్టు హాలులో జ‌డ్జిని బెదిరించిన వైనం సంచ‌ల‌నంగా మారింది.

ఆచార్య ఎన్జీ రంగా వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యంలో అక్ర‌మ ప‌దోన్న‌తుల‌పై 2016లో దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై వెంట‌నే విచార‌ణ చేప‌ట్టాల‌ని.. లేదంటే తాను సూసైడ్ చేసుకుంటానని.. ఆర్‌.వి.ఎన్‌.మూర్తి  కోర్టు హాలులో జ‌డ్జిని బెదిరించారు. అక్క‌డితో ఆగ‌కుండా బెల్టును తీసి మెడ‌కు చుట్టుకొనే ప్ర‌య‌త్నం చేశారు. దీనిపై న్యాయ‌స్థానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తీవ్రంగా ప‌రిగ‌ణించింది. కోర్టు పాల‌నా వ్య‌వ‌హారాల్లోకి జోక్యం చేసుకోవ‌టంగా ప‌రిగ‌ణించి.. కోర్టు ధిక్కారణ‌గా ఎందుకు ప‌రిగ‌ణించ‌కూడ‌దో చెప్పాలంటూ స‌ద‌రు వ్య‌క్తికి సంజాయిషీ కోరింది.

గురువారం కోర్టు ప్రారంభం అయిన వెంట‌నే తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ర‌మేశ్ రంగ‌నాథ‌న్‌.. జ‌స్టిస్ ఎం.గంగారావుల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఎదుట మూర్తి త‌న పిటిష‌న్ ను వెంట‌నే విచార‌ణ చేప‌ట్టాల‌ని అభ్య‌ర్థించారు. 2001 కేసులు ముందుండ‌గా.. ఆ వ‌రుస క్ర‌మాన్ని త‌ప్పించి 2016లో దాఖ‌లైన పిటిష‌న్‌ ను తాము విచారించ‌లేమ‌ని ధ‌ర్మాస‌నం త‌న నిస్స‌హాయ‌త‌ను ప్ర‌క‌టించింది.

ఈ సంద‌ర్భంగా నిబంధ‌న‌ల గురించి వివ‌రించింది. అయితే.. ధ‌ర్మాస‌నం మాట‌ల్ని ప‌ట్టించుకోని మూర్తి గ‌ట్టిగా అరుస్తూ త‌న కేసులో విస్తృత ప్ర‌జాప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని.. త‌క్ష‌ణ‌మే విచార‌ణ చేప‌ట్టాలంటూ ఒత్తిడి తెచ్చారు. వెంట‌నే విచార‌ణ చేప‌ట్ట‌క‌పోతే కోర్టు హాలులోనే ఉరి వేసుకుంటాన‌ని బెదిరించారు. ధ‌ర్మాస‌నాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య‌లు చేశారు.

దీంతో.. ఆగ్ర‌హించిన ధ‌ర్మాస‌నం స‌ద‌రు వ్య‌క్తిని కోర్టు బ‌య‌ట‌కు తీసుకెళ్లాల‌ని.. అదుపులోకి తీసుకొని కోర్టు ఆవ‌ర‌ణ‌లోనే ఉంచాల‌ని ఆదేశించారు. కోర్టుల‌లో న్యాయ‌మూర్తుల కొర‌త‌.. పెరిగిన అవ‌స‌రాల‌కు త‌గినంత‌గా కోర్టులు ఏర్పాటు చేయ‌క‌పోవ‌టం కేసు విచార‌ణ ఆల‌స్యానికి కార‌ణంగా చెబుతున్నారు. నిత్యం ప్ర‌జ‌ల‌కు వ‌రాల మీద వ‌రాలు కురిపించే ప్ర‌భుత్వాలు.. కేసుల విచార‌ణ‌ను పూర్తి చేసేందుకు న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేసే అంశం మీద ఎందుకు దృష్టి పెట్ట‌ద‌న్నది ప్ర‌శ్న‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News