మత్తయ్య కాల్‌డేటా బయటకు రావటం ఎంత కష్టమంటే..!

Update: 2015-07-03 08:16 GMT
ఓటుకు నోటు కేసు వ్యవహారం బయటకు వచ్చే వరకూ మత్తయ్య అంటే ఎవరికి తెలుసు? రాజకీయ వర్గాల్లో కూడా పెద్దగా పరిచయం లేని వ్యక్తి. అదే సమయంలో ఆయనపై ఎలాంటి కేసులు ఉన్నది లేదు. అంతేకాదు.. ఆయనేం కరుడుగట్టిన నేరస్తుడు కాదు. కానీ.. ఆయనకు సంబంధించిన కాల్‌డేటాను ఇచ్చేందుకు మాత్రం టెలికం సంస్థలు ససేమిరా అంటున్నాయి.

అంతేకాదు.. ఆయనకు సంబంధించిన కాల్‌డేటాను అందిస్తే.. అది దేశ అంతర్గత భద్రతకే ముప్పు అని చెప్పేసి షాకిస్తున్నాయి. మత్తయ్య అంత ప్రమాదకరమైన వ్యక్తా అని ఏపీ పోలీసు ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

మత్తయ్య.. ఆయన కుటుంబ సభ్యులు గత నెల రోజుల వ్యవధిలో ఎవరెవరితో మాట్లాడారన్న అంశానికి సంబంధించిన కాల్‌డేటా ఇవ్వాల్సిందిగా ఏపీ సిట్‌ అధికారులు టెలికం కంపెనీల్ని కోరటం తెలిసిందే. అయితే.. మత్తయ్య కాల్‌ డేటా ఇచ్చే విషయంలో కంపెనీలు.. ఏపీ దర్యాప్తు అధికారులకు చుక్కలు చూపిస్తున్న పరిస్థితి. ఏపీకి చెందిన పలువురు ముఖ్యనేతల ఫోన్లు ట్యాపింగ్‌ జరగటంతో పాటు.. ఓటుకు నోటు వ్యవహారంలో మత్తయ్యకు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. ఆయనకు సంబంధించిన కాల్‌డేటా ఇచ్చే విషయంలో టెలికం కంపెనీలు చెబుతున్న మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ట్యాపింగ్‌ నేపథ్యంలో సిట్‌ విచారణలో భాగంగా తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఏపీ సిట్‌ అధికారులకు వెల్లడించిన కంపెనీ ప్రతినిధులు తమ వద్ద ఉన్న ఆధారాల్ని మాత్రం ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో సిట్‌ అధికారులు విజయవాడ కోర్టును ఆశ్రయించారు. మరోవైపు టెలికం కంపెనీలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో నెల రోజుల సమయం కావాలని అడిగారు.

తాజాగా వారిప్పుడు..మత్తయ్య కాల్‌డేలా ఇస్తే దేశ అంతర్గత భద్రతకు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నందున.. తమ దగ్గరున్న సమాచారాన్ని ఇవ్వలేమని చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్‌.. సీఐడీ అధికారులతో ఏపీ డీజీపీ రాముడు సమీక్ష నిర్వహిస్తున్నారు. మత్తయ్య లాంటి ఒక వ్యక్తి దేశ అంతర్గత భద్రతకే ముప్పు వాటిల్లేంత సీన్‌ ఉందా? అని పోలీసు ఉన్నతాధికారులు విస్మయం చెందుతున్నారు. ఇంతకీ మత్తయ్య కాల్‌ డేటాలో ఉన్న సమాచారం ఏమిటో..?

Tags:    

Similar News