టీ మంత్రికి షాకిచ్చిన మీడియా

Update: 2015-10-08 06:16 GMT
అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఆ హడావుడే వేరుగా ఉంటుంది. అధికార.. విపక్ష నేతలతో పాటు.. ముఖ్యమంత్రి.. మంత్రులు.. కీలక ఉన్నతాధికారులంతా ఒకేచోట దర్శనమిస్తుంటారు. ఏదైనా మాట్లాడుకోవటానికి కానీ.. ఏ విషయం మీదైనా చర్చ జరపటానికి కానీ అసెంబ్లీ సమావేశాల సమయానికి మించింది మరొకటి ఉండదు.

వీటితో పాటు.. మీడియా ప్రతినిధులకు బోలెడన్ని వార్తలు కూడా వస్తుంటాయి. పలు పార్టీల నేతలు ఒకేచోట చేరటంతో వారి వ్యాఖ్యలు.. ఆసక్తికర వ్యాఖ్యలకు కొదవ ఉండదు. వీటితో పాటు.. కొందరు నేతలు మీడియాతో బాగా స్నేహపూర్వకంగా ఉంటూ.. ఏ మాత్రం ఖాళీ దొరికినా ముచ్చట్లు పెడుతుంటారు. సమాచార సేకరణలో ఉండే జర్నలిస్టులకు అసెంబ్లీ సమావేశాల సమయం చక్కటి అవకాశం. గ్యాలరీలో ఉండి వార్తలు కవర్ చేసే పాత్రికేయులకు పరిమితులు ఉంటాయి కానీ.. లాబీల్లో తిరుగుతూ ఉండే జర్నలిస్టులకు ఏ నేతతో అయినా ముచ్చటించే వీలు ఉంటుంది.

బుధవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి.. మీడియా ప్రతినిధుల వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా క్యాబినెట్ లో మార్పులు.. చేర్పులకు సంబంధించిన చర్చ మొదలైంది. ఈ సందర్భంగా ఉత్సాహంతో ఒక పాత్రికేయుడు.. జగదీశ్ రెడ్డిని ఉద్దేశించి.. మార్పులలో ప్రమోషన్ లభిస్తుందట కదా అని విషయాన్ని కదిపారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో హోం మంత్రి పదవి నల్గొండ జిల్లాకు ఇవ్వనున్నట్లు.. అది మీకేనట కదా అని వ్యాఖ్యానించారు. ఇంతలో మరొకరు.. టీఆర్ ఎస్ మాధవరెడ్డి మీరేనట కదా అని వ్యాఖ్యానించారు.

దీంతో వెంటనే స్పందించిన జగదీశ్ రెడ్డి.. ఏంటి నన్ను మాధవరెడ్డి చేస్తున్నారా? అంటూ గతంలో నల్గొండ జిల్లాకు చెందిన  మాధవరెడ్డి(టీడీపీ హయాంలో) హోంమంత్రి పదవి ఇవ్వటం.. ఆయన నక్సల్స్ చేతిలో హతమైన అంశాన్ని గుర్తుకు తెచ్చేలా వ్యాఖ్యానించారు. మొత్తానికి మాధవరెడ్డి మాట తెలంగాణ మంత్రికి షాకిచ్చినట్లైంది.
Tags:    

Similar News