కేసీఆర్ భేటీలో ఆ విష‌య‌మే రాలేద‌న్న క‌నిమొళి

Update: 2018-05-03 12:31 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెబుతున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఉండేకొద్దీ బ్ర‌హ్మ‌ప‌దార్థంగా మారుతోంది. రోజుకో తీరులో మాట్లాడుతున్న ఆయ‌న ఫ్రంట్ మాట‌లువిప‌రీత‌మైన గంద‌ర‌గోళానికి గురి చేస్తున్నాయి. బీజేపీ.. కాంగ్రెస్ పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయంగా త‌మ ఫ్రంట్ ఉంటుంద‌ని అంటూనే.. తాము థ‌ర్డ్ ఫ్రంట్‌.. ఫోర్త్ ఫ్రంట్ కాదంటూ సంబంధం లేని వ్యాఖ్య‌లు చేస్తున్న వైనం తెలిసిందే.

కేంద్రం రాష్ట్రాల్ని చిన్న‌చూపు చూస్తుంద‌న్న వాద‌న‌తో పాటు.. రాష్ట్రాన్ని మ‌రిన్ని పాల‌నాధికారులు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న వాద‌న‌ను తెర మీద‌కు తీసుకొచ్చిన కేసీఆర్‌.. రోజులు గ‌డుస్తున్న కొద్దీ త‌న వ్యాఖ్య‌ల్ని మారుస్తున్న వైనం కాంప్లికేటెడ్ గా మారుతోంది. ఈ తీరు కేసీఆర్‌లో మాత్ర‌మే కాదు.. ఆయ‌న క‌లుస్తున్న వివిధ పార్టీల కీల‌క నేత‌ల్లోనూ క‌నిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

మొన్న‌నే చెన్నై వెళ్లిన కేసీఆర్ డీఎంకే పెద్దాయ‌న క‌రుణ‌తో పాటు.. ఆయ‌న కుమారుడు స్టాలిన్‌.. కుమార్తె క‌నిమొళితో భేటీ కావ‌టం తెలిసిందే. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. మ‌రో రాష్ట్రానికి చెందిన ప్ర‌తిప‌క్ష నేత‌ల్ని క‌లుసుకోవటం ఇప్ప‌టికే ఆస‌క్తిక‌రంగా మారింది. భేటీ అయ్యాక‌.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మీద వారు చేసిన వ్యాఖ్య‌లు అస్ప‌ష్టంగా ఉండ‌గా.. ఎంపీ క‌నిమొళి వ్యాఖ్య‌లు మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారాయి.

స్టాలిన్ తో కేసీఆర్ భేటీ సంద‌ర్భంగా థ‌ర్డ్ ఫ్రంట్ గురించి చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌ని.. స్టాలిన్ భేటీ రాజ‌కీయ కూట‌మి దృష్టిలో జ‌ర‌గ‌లేద‌ని.. రాష్ట్రాల హ‌క్కుల గురించి మాత్ర‌మే చ‌ర్చించిన‌ట్లు చెప్పిన వైనం చూసిన‌ప్పుడు.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై కేసీఆర్ కు మాత్ర‌మే కాదు.. ఆయ‌న క‌లుస్తున్న ఇత‌ర పార్టీల నేత‌లు సైతం స్ప‌ష్టంగా చెప్ప‌లేక‌పోవ‌టం క‌నిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా యూపీ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాద‌వ్ తో భేటీ అయిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్.. తమ మీటింగ్ ముగిసిన త‌ర్వాత మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా దేశంలోని ప‌లు పార్టీలు క‌లిసి దేశ మార్పున‌కు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు చెప్ప‌ట‌మే కాదు.. నిరాశ ప‌డ‌కూడ‌ని.. రెండు.. మూడు నెల‌ల్లోనే పూర్తి ఎజెండాతో ముందుకు రానున్న‌ట్లు చెప్పారు. త‌క్కువ వ్య‌వ‌ధిలోనే ఎక్కువ మంది క‌లుస్తున్న‌ట్లు చెప్పిన అఖిలేశ్‌కు ఊహించ‌నిరీతిలో మీడియా స‌మావేశంలో చిక్కుప్ర‌శ్న ఎదురైంది. కాంగ్రెస్ త‌ర‌ఫున క‌ర్ణాట‌క‌లో ప్ర‌చారం చేస్తారా? అన్న ప్ర‌శ్న‌కు అఖిలేశ్ బ‌దులిస్తూ.. హైద‌రాబాద్ నుంచి క‌ర్ణాట‌క చాలా ద‌గ్గ‌రే అయినా తాను ల‌క్నోకు వెళుతున్న‌ట్లుగా చెప్పి.. అడిగిన ప్ర‌శ్న‌కు సూటిగా స‌మాధానం ఇవ్వ‌లేదు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో ఏదో చేయాల‌నుకుంటున్న కేసీఆర్.. ఇన్ని పార్టీల‌తో క‌లిసి ఏకాభిప్రాయం సాధించి.. ఒకే తాటి మీద న‌డిపించ‌గ‌లుగుతారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News