సోమిరెడ్డీ!... జ‌గ‌న్ నూ క‌లుపుకుపోతారా?

Update: 2019-05-15 01:30 GMT
జ‌రుగుతుందో  లేదోన‌ని టెన్ష‌న్ పెట్టేసిన ఏపీ కేబినెట్ ఎట్ట‌కేల‌కు జ‌రిగిపోవ‌డంతో టీడీపీ శ్రేణుల్లో ప్ర‌త్యేకించి చంద్ర‌బాబు - ఆయ‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల్లో ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. కేబినెట్ భేటీలో అజెండా మేర‌కే చ‌ర్చ జ‌రిగినా... రాజ‌కీయంగానూ మంత్రుల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లే జ‌రిగాయ‌ని తెలుస్తోంది. ఏపీలో ఇప్ప‌టికే ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ ముగిసిపోవ‌డం - ఈ నెల 23న ఫ‌లితాలు రానున్న నేప‌థ్యంలో ఈ చ‌ర్చ మొత్తం ఎన్నిక‌ల ఫ‌లితాల‌పైనే చ‌ర్చ జ‌రిగిన‌ట్టుగా స‌మాచారం. అయితే ఫ‌లితాలు ఎలా ఉంటాయోన‌న్న బెంగ మంత్రులంద‌రిలో క‌నిపించినా... మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శించిన అమాత్యులు... ఈ సారి కూడా త‌మ‌దే గెలుపు అంటూ బీరాలు ప‌లికారు.

అదే స‌మ‌యంలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి... రాష్ట్ర రాజ‌కీయాల‌ను వ‌దిలేసి ఏకంగా జాతీయ రాజ‌కీయాల‌పై త‌న‌దైన శైలి కామెంట్లు చేశారు. ఎన్నిక‌ల కోడ్ పేరిట త‌మ స‌మీక్ష‌ల‌ను అడ్డుకున్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారుల వెనుక ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కుట్ర దాగుంద‌ని సోమిరెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. ఈ సంద‌ర్బంగా మోదీ ఓట‌మే ల‌క్ష్యంగా తాము పావులు క‌దుపుతున్నామ‌ని కూడా ఆయ‌న చెప్పేశారు. ఇదే అద‌ను అనుకున్న మీడియా ప్ర‌తినిధులు.. మ‌రి మోదీకి వ్య‌తిరేకంగా టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు వ‌స్తే ఆయ‌న‌నూ ఆహ్వానిస్తారా? అంటూ ప్ర‌శ్నించారు.

ఈ ప్ర‌శ్న‌కు ఏమాత్రం ఆలోచించ‌కుండానే... మోదీకి వ్య‌తిరేకంగా కేసీఆర్ వ‌స్తే ఆయ‌న‌నూ క‌లుపుకుని వెళ‌తామ‌ని సోమిరెడ్డి సెల‌విచ్చారు. అంతేకాకుండా మోదీకి వ్య‌తిరేకంగా ఎవ‌రు వ‌చ్చినా క‌లుపుకుని పోతామ‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఇక్క‌డే అంద‌రికీ మ‌రో డౌట్ వ‌చ్చింది. అయితే ఆ డౌట్ ను మీడియా ప్ర‌తినిధులు ఆయ‌న ముందు ప్ర‌స్తావించ‌లేదు గానీ... వారి మ‌దిలోనే ఎవ‌రికి త‌గిన రీతిలో వారు లెక్క‌లేసుకున్నార‌ట‌. ఒక‌వేళ‌... వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా మోదీకి వ్య‌తిరేకంగా వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంటే... ఆయ‌న‌నూ క‌లుపుకుని పోతారా? అన్న‌దే ఆ డౌటు. ఈ ప్ర‌శ్న ఎదురు కాలేదు గానీ, ఎదురై ఉంటే సోమిరెడ్డి ఏం చెప్పేవార‌న్న‌దే ఇప్పుడు ప్ర‌శ్న‌గా మిగిలింది.

Tags:    

Similar News