జలీల్ ఖాన్ జనరల్ నాలెడ్జి సూపర్

Update: 2016-12-27 10:14 GMT
ఎవరినైనా దుమ్మెత్తిపోయడంలో ముందుండే ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను చూస్తే ఆయనేదో మేధావి అనుకుంటారు అంతా. అనుకున్నట్లే ఆయనకు చిన్నప్పటి నుంచి 100కి 100 మార్కలు వచ్చేవట. ముఖ్యంగా లెక్కల్లో ఎప్పుడూ నూటికి నూరేనట. చివరకు ఆయన బీకాం చదువుతున్నప్పుడు కూడా లెక్కల్లో నూటికి నూరు మార్కులు వచ్చాయట. షాక్ అవ్వకండి. జలీల్ ఖాన్ బీకాం చదివినా అందులో మ్యాథ్స్ - ఫిజిక్సు కూడా ఉన్నాయట.  గందరగోళంగా ఉందా... బీకాం ఏంటి.. అందులో మ్యాథ్స్ - ఫిజిక్సు ఏంటని అనుకుంటున్నారా.. జలీల్ ఖాన్ అలాగే చదువుకున్నారట మరి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా ఈ విషయం చెప్పారు.. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి కాదని అంటున్నా కూడా అడ్డంగా వాదించారు.  చూడబోతే జలీల్ ఖాన్ చదువుకున్నప్పుడు సబ్జెక్టులు ఫిరాయించినట్లుగా కనిపిస్తోంది మరి.
    
జలీల్‌ఖాన్ జనరల్ నాల్డెడ్జ్‌ చూసి ఆ ఇంటర్వ్యూ చేసిన యాంకర్ పాపం నవ్వాపుకోలేక నానా ఇబ్బందులు పడ్డారు. కష్టపడి గాంభీర్యం తెచ్చిపెట్టుకుని ఎలాగోలా మేనేజ్ చేశారు.  మీరు ఏం చదివారు అని యాంకర్ ప్రశ్నించగా బీకాం చదివానంటూ జలీల్ ఖాన్‌ సమాధానం చెప్పారు. చార్టెడ్ అకౌంట్ అవ్వాలన్న కోరికతో బీకాం చేశారా అని యాంకర్ అడగ్గా… జలీల్‌ ఖాన్ మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం చెప్పారు. తనకు మ్యాథమాటిక్స్ - ఫిజిక్స్ అంటే ఇష్టమని అందుకే బీకాం తీసుకున్నానని చెప్పారు ఎమ్మెల్యే. దీంతో యాంకర్ కు ఏమీ అర్థం కాలేదట.
    
అయినా, ఆయన కోలుకుని.. బీకాం అంటున్నారు… మ్యాథమాటిక్స్ - ఫిజిక్స్ ఉండవు కదా అని యాంకర్ అనుమానం వ్యక్తం చేయగా… లేదు లేదు బీకాంలో ఫిజిక్స్ - మాథ్యమాటిక్స్ ఉంటాయని ధీమాగా చెప్పారు. వెంటనే యాంకర్ తాను కూడా బీకాం చదివానని అక్కడ మ్యాథమాటిక్స్ - ఫిజిక్స్ ఉండదని చెప్పారు. అయినా.. కూడా జలీల్ ఏమాత్రం తగ్గకుండా ‘ఆ.. అదే అది ఉంటే మ్యాథ్సే కదా’’ అని మ్యానేజ్ చేశారు. స్టాటిస్టిక్సు అనడం కూడా రాకుండా అది ఉంటే అంటూ కవర్ చేశారు. అయితే.. ఫిజిక్స్ విషయంలో మాత్రం ఎమ్మెల్యే వెనక్కు తగ్గలేదు. బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని  మళ్లీమళ్లీ చెప్పారు.
    
సో.. చంద్రబాబు మళ్లీ మంత్రివర్గాన్ని విస్తరిస్తే జలీల్ ఖాన్ కు తప్పకుండా విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వమని చెప్పాలి మరి.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News