ఆవిర్భావ దినోత్స‌వం నాడే ర‌గ‌డ: క‌ల‌క‌లం రేపిన టీఆర్ ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు

Update: 2020-04-27 16:17 GMT
పార్టీ స్థాపించి 20 ఏళ్లు పూర్త‌య్యింది. సంబ‌రంగా చేసుకోవాల్సిన ఉత్స‌వాలు లాక్‌ డౌన్‌ తో సాదాసీదాగా జ‌రిగాయి. ఎలాంటి హ‌డావుడిగా కొన‌సాగుతున్న ఆవిర్భావ ఉత్స‌వాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. పార్టీలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై ఆయ‌న తీవ్ర అక్కసుతో మాట్లాడారు. దీంతో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో టీఆర్ ఎస్ నాయ‌కుల్లో విబేధాలు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. మాజీ ఉప ముఖ్య‌మంత్రి - స్టేషన్ ఘన్‌ పూర్ ఎమ్మెల్యే రాజయ్య సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

స్టేషన్ ఘన్‌ పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా - గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నార‌ని తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక తల్లి - తండ్రికి పుట్టినవాళ్లే అయితే.. ఇలా తల్లి పాలు తాగి రొమ్ము కోసే రాజకీయాలు మానుకోవాలని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే తండ్రి లాంటి వాడని.. అక్కడికి ఎవరు రావాలన్నా ఎమ్మెల్యే అనుమతి ఉండాలని స్ప‌ష్టం చేశారు. ఈ విధంగా రాజ‌య్య వ్యాఖ్య‌లు చేయ‌డంతో టీఆర్ ఎస్‌ లో క‌ల‌క‌లం రేపాయి. రాజయ్య వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపే అవ‌కాశం ఉంది.

అయితే రాజ‌య్య చేసిన వ్యాఖ్య‌ల వెనుక ఎంతో ఆవేద‌న ఉంద‌ని క‌నిపిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పైనే మాట్లాడిన‌ట్టు క‌నిపిస్తోంది. కడియం శ్రీహరిని ఉద్దేశించి ప‌రోక్షంగా ఆ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఎందుకంటే ఎప్ప‌టి నుంచో క‌డియం శ్రీహ‌రి త‌న కుమార్తె కావ్య‌ను స్టేష‌న్ ఘ‌న్‌ పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయించాల‌ని భావిస్తున్నారు. ఆ క్ర‌మంలో 2018 ఎన్నిక‌ల్లో త‌న కుమార్తెకు ఇవ్వాల‌ని పార్టీ అధిష్టానానికి శ్రీహ‌రి విజ్ఞ‌ప్తులు చేస్తూ తన కుమార్తెకు టికెట్ కోసం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారు. చివ‌ర‌కు రాజ‌య్య‌కే ద‌క్కింది. ఈ విధంగా కాద‌ని క‌డియం శ్రీహ‌రి త‌న కుమార్తెను స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టించి త‌న హ‌వా పెంచుకునేలా చేస్తున్నారు. పట్టు పెంచుకునేందుకు కావ్య ప్రయత్నాలు చేస్తుండ‌డంతో దాన్ని ఉద్దేశించి క‌డియం శ్రీహ‌రిపై రాజయ్య ఆ వ్యాఖ్య‌లు చేశారు. అయితే ప‌రిణామాలు ఎక్క‌డ‌కు దారి తీస్తాయో వేచి చూడాలి.


Tags:    

Similar News