యడియూరప్ప ద్వారా మోడీ తనకు లైన్ క్లియర్ చేసుకున్నారా?

Update: 2019-07-31 14:30 GMT
మొన్నటి వరకూ డెబ్బై ఐదేళ్ల వయసు దాటిన వారికి పార్టీలో కీలక పదవులు దక్కకూడదు.. అని భారతీయ జనతా పార్టీ వాళ్లు ఒక రూల్ పెట్టుకున్నారు. ఆ రూల్ తో అనేక మంది సీనియర్లకు ఎలాంటి కీలకమైన పదవులు దక్కకుండా చూసుకున్నారు. అదంతా మోడీ - అమిత్ షాలు వ్యూహాత్మక వ్యవహారం అని పరిశీలకులు అభిప్రాయపడుతూ వచ్చారు.

పార్టీలో తమ కన్నా సీనియర్లు ఉంటే వాళ్లు ఏదో రకంగా తమకు అడ్డంకిగా మారే అవకాశం ఉందని - కాబట్టే డెబ్బై ఐదేళ్ల నియమాన్ని వారు తీసుకొచ్చారనే అభిప్రాయాలున్నాయి. అయితే పార్టీ రాజ్యాంగంలోకి అలాంటి నిబంధనను ఇంక్లూడ్ చేస్తే.. అది రేపు మోడీ - అమిత్ షా లకు కూడా ఇబ్బందికరంగా మారే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే మోడీ - షాల వయసు కూడా తక్కువేమీ కాదు! వాళ్లు ఇంకా ఏమీ నలభై యేళ్ల యువకులు కూడా కాదు!

ఈ టర్మ్ అధికారం ముగిసే సరికి మోడీ వయసు డెబ్బై నాలుగేళ్ల వరకూ వెళ్తుంది. అంటే వచ్చేసారి ఎన్నికలను ఎదుర్కొనడానికి కూడా మోడీకి వయసు అడ్డొస్తుందా? అనే సందేహాలు సహజంగా కలుగుతాయి. మోడీ పదిహేనేళ్లు - ఇరవై యేళ్లు ప్రధానిగా ఉంటారనే వాదన ఉంది. అయితే డెబ్బై ఐదేళ్ల వయసు నిబంధన అందుకు అవకాశాలు ఇవ్వవు. ఈ నేపథ్యంలో మోడీ - అమిత్ షాలు అప్పుడే అలర్ట్ అయ్యారని - తమకు లైన్ క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారని స్పష్టం అవుతోంది.

అందులో భాగంగానే కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ నేత యడియూరప్పకు సీఎం పీఠాన్ని అప్పగించడం అందులో భాగమే అని టాక్. యడియూరప్ప వయసు ఇప్పటికే డెబ్బై ఐదు దాటింది. మోడీ - షా రూల్ ప్రకారం.. ఆయనకు సీఎం పీఠం దక్కకూడదు. అయినా ఆయనకే సీఎం సీటును ఇచ్చారు. ఇదంతా గేమ్ అని - భవిష్యత్తులో తాము డెబ్బై ఐదేళ్ల వయసు తర్వాత కూడా పదవుల్లో కొనసాగేందుకే మోడీ - షాలు యడియూరప్పకు అవకాశం ఇచ్చారనే ప్రచారం జరుగుతూ ఉండటం గమనార్హం!
Tags:    

Similar News