పాకిస్థాన్ అడుక్కుతిన‌డానికి-మోడీకి సంబంధం ఉందా?!

Update: 2023-01-20 04:30 GMT
భార‌త్ దాయాది దేశం పాకిస్థాన్‌.. ప్ర‌స్తుతం నానా తిప్ప‌లు ప‌డుతోంది. తినేందుకు తిండిలేక‌.. క‌నీసం గోధు మ పిండికి కూడా క‌రువైన ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ క్ర‌మంలోనే అనూహ్యంగా భార‌త్‌తో చ‌ర్చ‌ల‌కు తాము సిద్ధ‌మ‌ని పాకిస్థాన్ ప్ర‌ధాన‌మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్ ప్ర‌క‌టించారు. అయితే.. ఇప్పుడు ఒక వీడియో దేశంలో పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతోంది. అదేంటంటే.. పాకిస్థాన్‌.. ఇలా అడుక్కునే స్థితికి చేర‌డం వెనుక మోడీనే కార‌ణ‌మ‌ని.. పేర్కొంటున్నారు.

పాకిస్థాన్ గ‌ర్వాన్ని పూర్తిగా అణిచివేశార‌ని.. మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మోడీ వ‌ల్లే పాకిస్థాన్‌ ఇప్పుడు చేతులు క‌ట్టుకుని.. సిగ్గుతో భార‌త్ ముందు నిల‌బ‌డి అర్థిస్తోంద‌ని బీజేపీ నాయ‌కులు పేర్కొంటున్నారు. దీనికి కార‌ణం.. 2016లో మోడీ చేసిన ఒక ప్ర‌సంగం. అప్ప‌ట్లోఆయ‌న మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు అడుక్కునే ప‌రిస్థితి వ‌స్తుంద‌న్నారు. సో.. దీనిని వైర‌ల్ చేస్తున్నారు బీజేపీ నాయ‌కులు.

మ‌రి ఇది నిజ‌మేనా?  మోడీ వ‌ల్లే పాకిస్థాన్ ఇంత దుర్భ‌ర స్థితికి చేరిందా? అనేది ఆస‌క్తిగా మారింది. దీనిని చ‌ర్చించే ముందు.. భార‌త్ చుట్టుప‌క్క‌ల ఉన్న దేశాల ప‌రిస్థితిని ఒక‌సారి చూద్దాం. భార‌త్‌కు చుట్టుప‌క్క‌ల బంగ్లాదేశ్‌, శ్రీలంక‌, మ‌య‌న్మార్‌, పాకిస్తాన్‌, నేపాల్ దేశాలు ఉన్నాయి. వీటిలో శ్రీలంక‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ లు.. చైనాతో ఒప్పందాలు చేసుకుని.. ఆ దేశం నుంచి భారీ ఎత్తున అప్పులు తీసుకున్నాయి.

ఈ అప్పుల‌తో కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించాయి. అయితే.. ఈ ప్రాజెక్టుల‌కు సంబంధించిన ముడి సామ గ్రితోపాటు.. ఉత్ప‌త్తిలో 85%  తిరిగి చైనాకే త‌క్కువ ధ‌ర‌ల‌కు ఇవ్వాలి. ఈ ఒప్పందంతోనే అవి అప్పులు చేశాయి. దీంతో మొద‌ట్లో ఆయా దేశాల ప‌రిస్థితిబాగానే ఉన్న‌ప్ప‌టికీ.. అధిక వ‌డ్డీలు వాటి ఆర్థిక ప‌రిస్థితిని దెబ్బ‌తీశా యి. దీంతో వాటిని తీర్చేందుకు మ‌రిన్ని అప్పులు చేయాల్సి రావ‌డం గ‌మ‌నార్హం.

ఈ క్ర‌మంలోనే గ‌త ఏడాది శ్రీలంక‌.. నిండా మునిగిపోయింది. ఇప్ప‌టికీ ఆర్థికంగా ఇబ్బందులు ప‌డుతోంది. ఇక‌, పాకిస్థాన్ ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. పాకిస్థాన్‌కు అప్పులు ఇచ్చిన చైనా.. ఆ సొమ్ముతో.. ఇరు దేశాల‌కు భార‌త భూభాగాన్ని ఆనుకుని అరుణాచ‌ల్ మీదుగా ర‌హ‌దారి నిర్మాణం చేసింది. మొత్తంగా.. చైనాతో సాగించిన వ్య‌వ‌హారానికి తోడు.. స్థానికంగా తెహ్రెక్ ఏ పాకిస్థాన్ ఉగ్ర‌వాద సంస్థ ఆధి ప‌త్యం, అమెరికాతో ప‌ల‌చ‌బ‌డిన‌ సంబంధాలు వంటివి పాకిస్థాన్‌ను నైతికంగా, ఆర్థికంగా దెబ్బ‌తీశాయి.

అదేస‌మ‌యంలో ఆఫ్ఘ‌నిస్థాన్‌లో  చోటు చేసుకున్న ప‌రిణామాలు కూడా పాకిస్థాన్‌పై ప్ర‌భావం చూపించాయి. అంత‌కుమించి మోడీ ప్ర‌భావం కానీ.. ఆయ‌న ఊసు కానీ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఒక‌వేళ మోడీనే త‌మ దుస్థితికి కార‌ణ‌మ‌ని పాక్ భావిస్తే.. ఇప్పుడు ఇలా.. మోడీతో చ‌ర్చ‌లు ఎందుకు దిగుతాన‌ని ప్ర‌క‌టిస్తుంది? అనేది చిన్న లాజిక్‌. ఏదేమైనా బీజేపీ నేత‌ల అత్యుత్సాహం.. మోడీ ప్ర‌చార యావ‌కు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు.
Tags:    

Similar News