‘‘జతి ఉమ్రా రైవింద్’’లో ఆ 80 నిమిషాలు

Update: 2015-12-26 06:56 GMT
ఉప్పు.. నిప్పులా ఉండే దాయాదుల మద్య సరికొత్త స్నేహగీతం స్టార్ట్ అయ్యిందా అంటే అవుననే మాటే వినిపిస్తోంది. భారత ప్రధాని నరేంద్రమోడీ.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ల మద్య స్నేహం రోజురోజుకీ బలపడుతోంది. వీరి మధ్య స్నేహం.. రెండు దేశాల మధ్య అనుబంధం మరింత పెరగటానికి.. ఉద్రిక్తతలు తగ్గటానికి సాయం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేవలం.. రెండు.. గంటల ముందు తాను పాక్ కు వెళుతున్నట్లుగా ప్రధాని మోడీ ట్విట్టర్ లో ట్వీట్ చేసి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చారు. అప్ఘనిస్థాన్ పర్యటనలో ఉన్న ఆయన.. షెడ్యూల్ ప్రకారం ఢిల్లీకి నేరుగా రావాల్సి ఉంది. కానీ.. అందుకు భిన్నంగా ఆయన లాహోర్ లో దిగారు. దాదాపు మూడు గంటల పాటు పాక్ లో గడిపిన మోడీ.. 80 నిమిషాల సేపు మిత్రుడు నవాజ్ షరీఫ్ ఇంట (జతి ఉమ్రా రైవింద్) అతిధ్యం తీసుకోవటం విశేషం.

ఇక.. ఈ 80 నిమిషాలలో దాదాపు 60నిమిషాలు ఏకాంతంగా నవాజ్ తో చర్చలు జరిపారు. దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. ఇక.. లాహోర్ వచ్చిన ప్రధాని మోడీకి  స్వాగతం పలికేందుకు పాక్ ప్రధాని ఎయిర్ పోర్ట్ లో గంట పాటు వెయిట్ చేయటం ఒక విశేషమైతే.. తిరిగి వెళ్లే సమయంలోనూ ఆయన స్వయంగా ఎయిర్ పోర్ట్ కి వచ్చి వీడ్కోలు పలికి పంపటం మరో విశేషం. తన లాహోర్ పర్యటన అద్భుతంగా జరిగినట్లుగా ట్విట్టర్ ద్వారా పేర్కొన్న మోడీ.. షరీఫ్ కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడిచినట్లుగా పేర్కొన్నారు. తమ సంభాషణల్లో అటల్ బిహారీ వాజ్ పేయ్ తో తనకున్న అనుబంధాన్ని నవాజ్ పేర్కొన్నట్లు తెలిపారు.

నవాజ్ ఇంటికి వెళ్లిన సమయంలో ఆయన తల్లికి మోడీ పాదాభివందనం చేయటం.. పెళ్లి కుమార్తె మెహ్రున్నిసాకు శుభాకాంక్షలు చెప్పటం .. షరీఫ్ కుటుంబ సభ్యుల్ని పలుకరించటం లాంటివి మోడీ చేశారు.  మోడీకి ప్రత్యేక విందును ఇచ్చిన షరీఫ్ ఆయన కోసం ప్రత్యేకంగా శాఖాహార వంటకాల్నితయారు చేయించారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తనతో ఉన్న వారిలో 11 మందిని మాత్రమే మోడీ షరీఫ్ ఇంటికి తీసుకెళ్లారు. ఇందుకోసం వారికి 72 గంటల పాటు వీసాను జారీ చేశారు. అదే సమయంలో విమానంలో మిగిలిన మరో వందకు పైగా భారత ప్రతినిధులను ఎయిర్ పోర్ట్ లోనే ఉంచేసి.. వారికి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
Tags:    

Similar News