ఈసారి ఇఫ్తార్ కు మోడీ డుమ్మా

Update: 2015-07-15 05:35 GMT
మనసులో ఉండాలే కానీ.. అన్నీ అవే అడ్జెస్ట్ అవుతాయి. మనసులో లేనిదే ఎవరు ఎంత చెప్పినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రధాని మోడీ విషయంలో ఈ మాట నూటికి నూరుపాళ్లు నిజం అనిపించక మానదు.

రంజాన్ సందర్భంగా రాష్ట్రపతి ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందునకు ప్రధాని మోడీ హాజరు కావటం లేదు. గత ఏడాది సైతం రాష్ట్రపతి ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు హాజరు  కాకపోవటం తెలిసిందే.

ఊపిరి సలపని బిజీ షెడ్యూల్ కారణంగా ఇఫ్తార్ విందునకు మోడీ హాజరు కావటం లేదని చెప్పినప్పటికీ.. మోడీకి పెద్దగా ఇష్టం లేదన్న మాట లోగుట్టుగా వినిపిస్తోంది. ఇఫ్తార్ విందు గైర్హాజరీకి ప్రధానమంత్రి కార్యాలయం చూపిస్తున్న కారణాలు మాత్రం సహేతుకంగా ఉన్నట్లు కనిపిస్తున్నా.. ప్రధానమంత్రి తలుచుకోవాలే కానీ.. సాధ్యం కాకుండా ఉంటుందా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఒక ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులపై ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కావటంతో పాటు.. తన నివాసంలో నీతి అయోగ్ పాలకమండలితో సమావేశం లాంటి కారణాల్ని ప్రధానమంత్రి కార్యాలయం చూపిస్తోంది. కారణం ఏదైతేనేం.. సారం మాత్రం.. రాష్ట్రపతి సాబ్ ఇచ్చే ఇఫ్తార్ విందునకు ప్రధానమంత్రి హాజరు కావటం లేదంతే.
Tags:    

Similar News