మోడీ క్యాబినెట్ లో ప్రమోషన్ ఎవరికి?

Update: 2016-06-17 07:52 GMT
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే కాదు.. విజయవంతంగా పూర్తి చేసిన మోడీ తాజాగా మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల చోటు చేసుకున్న పలు పరిణామాల నేపథ్యంలో తన క్యాబినెట్ లో మార్పులు చేర్పులు చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం భారీ కసరత్తే జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మోడీ క్యాబినెట్ లో మార్పులు త్వరలో చోటు చేసుకోనున్నాయని చెబుతున్నారు. బీజేపీ చరిత్రలో ఎవరికి దక్కని గౌరవం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి దక్కిన విషయం తెలిసిందే. వరుసగా నాలుగుసార్లు రాజ్యసభకు ఒక బీజేపీ నేతను ఎంపిక చేయటం వెంకయ్యకు మాత్రమే సాధ్యమైంది. ఇంత ప్రాధాన్యత ఇచ్చిన వెంకయ్యకు.. మంత్రివర్గంలో మరింత కీలక బాధ్యత ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఆయనకు కీలకమైన గ్రామీణాభివృద్ధి.. వ్యవసాయం లాంటి పెద్ద శాఖల్ని ఇచ్చే వీలుంది. ఇక.. కేంద్ర మంత్రి వర్గంలో అత్యంత కీలకమైన టాప్ ఫోర్ ఫోర్ట్ ఫోలియోల (ఆర్థిక.. రక్షణ.. డిఫెన్స్.. విదేశాంగ)లో ఎలాంటి మార్పులు ఉండవని తెలుస్తోంది. ఇక క్రీడల మంత్రిగా ఉన్న సోనోవాల్ అసోం సీఎంగా బాధ్యతలు చేపట్టటంతో ఆయన స్థానంలో మరొకరిని తీసుకోవటం ఖాయమని చెబుతున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాఖండ్ కు చెందిన భగత్ సింగ్ కోషియారీ.. అసోంకు చెందిన రామేశ్వర్ తేలి కూడా కేంద్ర క్యాబినెట్ లో స్థానం దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. వీరితో పాటు నవజ్యోతి సింగ్ సిద్దు. యోగి అదిత్యనాథ్.. సత్యపాల్ సింగ్.. సాధ్వీ సావిత్రిబాయి పూలే పేర్లు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. కీలకమైన మానవవనరుల శాఖ నుంచి స్మృతి ఇరానీని తప్పించి సుబ్రమణ్య స్వామికి కట్టబెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక.. బీహార్ కు చెందిన కొందరు మంత్రుల పని తీరు విషయంలో అసంతృప్తిగా ఉన్నారని.. వారిని క్యాబినెట్ నుంచి తప్పించే వీలుందన్నది సమాచారం. త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్..మధ్యప్రదేశ్.. ఉత్తరాఖండ్.. పంజాబ్.. గోవా.. మణిపూర్ లకు విస్తరణలో అవకాశం కల్పించటం ద్వారా ఆయా రాష్ట్రాల్లోని బలమైన నాయకత్వాన్ని పెంచుకునే దిశగా మోడీ అడుగులు పడనున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా ఈసారి క్యాబినెట్ మార్పులు ఆసక్తికరంగా ఉండటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News