మోహన్‌బాబు చేసిన కామెంట్లపై సాయిబాబా భ‌క్తులు అసంతృప్తి

Update: 2022-08-10 11:30 GMT
ప్ర‌ముఖ సినీ న‌టుడు మంచు మోహన్‌బాబు మరో వివాదంలో చిక్కుకున్నారు. షిర్డీ సాయినాథునిపై ఆయన చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి కారణం. మోహ‌న్ బాబు చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి మండ‌లం ఎ రంగంపేటలో శ్రీ విద్యానికేత‌న్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ను న‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల మోహ‌న్ బాబు యూనివ‌ర్సిటీని కూడా ఆయ‌న ఏర్పాటు చేశారు.

అలాగే సాయిబాబాకు అప‌ర భక్తుడైన మోహ‌న్ బాబు ద‌క్షిణాదిలోనే అతి పెద్ద‌దైన సాయి బాబా గుడిని ఎ రంగంపేట‌లో నిర్మించారు. ఆ గుడికి సంబంధించిన‌ విగ్ర‌హ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మంలో మోహ‌న్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ గుడి ఒక అద్భుత‌మ‌ని చెప్పారు. నా దృష్టిలో ఇక భ‌క్తులు షిర్డీ సాయినాథుని ఆల‌యానికి వెళ్ల‌న‌క్క‌ర్లేదు అని వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్య‌లో షిర్డీపై మోహన్‌బాబు చేసిన కామెంట్లపై సాయిబాబా భ‌క్తులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌ని మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌హారాష్ట్ర‌లో ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రంగా ఉన్న షిరిడీకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది భ‌క్తులు వెళ్తుంటారు. ఈ నేప‌థ్యంలో షిరిడి సాయినాథుడిపై మోహ‌న్ బాబు వ్యాఖ్య‌ల‌పై సాయి భ‌క్తులు ఎలా స్పందిస్తారో చూడాల్సిందేన‌ని అంటున్నారు.

కాగా తాను ఈ గుడి క‌ట్టాల‌నుకున్న‌ప్పుడు త‌న కుమారుడు విష్ణు బాబు ఒక మాట అన్నాడ‌ని మోహ‌న్ బాబు గుర్తు చేసుకున్నారు. వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చిన భక్తులందరూ ఈ గుడికి రావాలి.. అలా కడితే కట్టండి లేకపోతే లేద‌ని విష్ణు అన్నాడ‌ని మోహ‌న్ బాబు గుర్తుచేసుకున్నారు. త‌న కుమారుడు ఆశించిన‌ట్టే ఈ దేవాల‌యాన్ని నిర్మించామ‌ని మోహ‌న్ బాబు తెలిపారు.

రుషికేష్ నుంచి దాదాపు 110 సంవత్సరాలకు పైనున్న ఒక యోగితోపాటు ఎంతో మంది స‌హ యోగులు, రుషీశ్వరులు నుంచి చెక్కలు, అమూల్యమైన మూలికలు తీసుకొచ్చి ఆలయంలో పెట్టామన్నారు.. ఇదంతా త‌న ఒక్క‌డి కోసం కాద‌న్నారు. విద్యాలయం, ప‌క్క గ్రామాలు, రెండు తెలుగు రాష్ట్రాలు, యావ‌త్ భార‌త‌దేశం నెంబ‌ర్ వ‌న్‌గా ఉండాల‌ని, అంద‌రూ క్షేమంగా ఉండాల‌ని దేవాల‌యాన్ని నిర్మించామ‌న్నారు.

అయితే, అదంతా ఎలా ఉన్నా.. సాయి భక్తులు ఇకపై షిర్డీకి వెళ్లనవసరం లేదని మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలపై నెటిజ‌న్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News