తెలంగాణలో కంటే జనాభా ఎక్కువ.. హైకోర్టులో జడ్జిలు మాత్రం తక్కువా?

Update: 2021-06-10 06:38 GMT
తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న దాని కంటే అదనంగా పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. రెండేళ్లుగా పెండింగ్ లో ఉండటం.. తెలంగాణ హైకోర్టు సీజేతో పాటు.. గవర్నర్.. ముఖ్యమంత్రి వినతులు పెట్టినా క్లియర్ కాని ఈ ఇష్యూను సుప్రీం చీఫ్ జస్టిస్ ఎల్వీ రమణ చొరవతో ఈ ఇష్యూ ఒక కొలిక్కి వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 42కు పెరిగింది సరే.. మరి ఏపీలో ఎంత మంది హైకోర్టు జడ్జిలు ఉన్నారు? దేశంలో అత్యధికంగా జడ్జిలు ఉన్న హైకోర్టు ఏది? అన్న అంశంతో పాటు పలు ఆసక్తికర అంశాలు ఇప్పుడు చర్చకు వచ్చాయి.

అందులో ముఖ్యమైనది జనాభా ప్రాతిపదికన చూస్తే..తెలంగాణ కంటే ఏపీలోనే జనాభా ఎక్కువ. కానీ.. ఏపీతో పోలిస్తే తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తుల కేటాయింపు ఎక్కువగా ఉండటం విశేషం. న్యాయ వర్గాల సమాచారం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని పలు కేసులు తెలంగాణ హైకోర్టులో ఉండటంతో వీటి విచారణకు ఎక్కువమంది న్యాయమూర్తుల అవసరం ఉందన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

ప్రస్తుతం తెలంగాణలో సుమారు 2.5 లక్షల కేసులు పెండింగ్ లో ఉండగా..అందులో 2.10 లక్షలు సివిల్ కేసులు ఉంటే.. 40వేలు క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల సంఖ్యతో పోల్చినప్పుడు కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారిపై విపరీతమైన పని భారం పడుతోంది. అందుకే తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తుల సంఖ్య పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతారు. తెలంగాణతో పోలిస్తే ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల కేటాయింపులో ఐదు పోస్టుల తక్కువగా ఉంటాయని చెబుతారు.

దేశ వ్యాప్తంగా అత్యధిక న్యాయమూర్తులు ఉన్న రాష్ట్ర హైకోర్టులో అలహాబాద్ నిలుస్తుందని చెబుతారు. అక్కడ ఏకంగా 160 న్యాయమూర్తుల పోస్టులు ఉన్నాయి. ముంబయి హైకోర్టుకు 94.. పంజాబ్.. హర్యానా హైకోర్టుకు 85..తమిళనాడులోని మద్రాస్ హైకోర్టుకు 75, బెంగాల్ హైకోర్టుకు 72, కర్ణాటక హైకోర్టుకు 62, డిల్లీ హైకోర్టుకు 60, మధ్యప్రదేశ్ హైకోర్టుకు 53, బిహార్ హైకోర్టుకు  53, రాజస్థాన్ హైకోర్టుకు 50, కేరళ హైకోర్టుకు 47 పోస్టులు ఉన్నాయి. అయితే.. పలు ఖాళీలు ఉన్నట్లు చెబుతారు.
Tags:    

Similar News