రెండుసార్లు పుట్టిన ఒకే బిడ్డ.. ఎలాగంటే? లేదా ఒకే బిడ్డ.. రెండుసార్లు జన్మ

Update: 2022-05-19 05:57 GMT
ప్రస్తుతం వైద్య శాస్త్రం బాగా అభివృద్ధి చెందింది. రోజురోజుకి ఎంతో ఆధునికతను సంతరించుకుంటోంది. కొత్త కొత్త వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి.. ఇంకా వస్తున్నాయి. వైద్య శాస్త్రం తెచ్చిన ఈ ఆధునికతతో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి.

తాజాగా అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక మహిళ విషయంలో ఇలాంటి అద్భుతమే జరిగింది. ఫ్లోరిడాలో జాడెన్‌ ఆష్లే అనే ఒక మహిళ కొద్ది నెలల క్రితం గర్భం దాల్చింది. అయితే కడుపులో ఉన్న శిశువుకు సమస్యలు తలెత్తాయని వైద్యులు చెప్పారు. బిడ్డకు వెన్నెముక సమస్య ఉందని తెలిపారు. దీన్ని వెంటనే సరిచేయకపోతే బిడ్డ ప్రాణం పోవడం పోవచ్చని వెల్లడించారు. అయితే భయపడాల్సిన పనిలేదని బిడ్డను తాము రక్షిస్తామని జాడెన్‌కు భరోసా ఇచ్చారు.

అప్పటికి కడుపులో 6 నెలలు (24 వారాలు) నిండిన బిడ్డను ఆధునిక వైద్య పద్ధతులను వినియోగించి గర్భం నుంచి బయటకు తీశారు. సమస్య తలెత్తిన బిడ్డ వెన్నెముకకు శస్త్రచికిత్స నిర్వహించారు. తిరిగి బిడ్డను జాడెన్‌ ఆష్లే కడుపులో ప్రవేశపెట్టారు.

తర్వాత 11 వారాలు పూర్తి కావడంతో ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డ ఇద్దరూ ఇప్పుడు ఆరోగ్యంతో ఉన్నారు. ఇలా ఒకే బిడ్డ రెండుసార్లు జన్మించినట్టు అయ్యింది. ఒకసారి కడుపులో 6 నెలల వయసు ఉన్నప్పుడు, మళ్లీ నెలలు నిండాక.. ఇలా ఒకే బిడ్డ రెండుసార్లు జన్మించడం వైద్య శాస్త్రంలో అరుదని వైద్యులు చెబుతున్నారు.

మనదేశంలో వేదాలు, పురాణాల్లోకెళ్తే ఇలాంటివి కనిపిస్తాయి. తల్లి కడుపులో ఎదిగిన పిండాన్ని బయటకు తీసి కృత్రిమ పద్ధతుల్లో పెంచడం వంటివి జరిగాయి. కొంతమంది మట్టి కుండలో పుట్టారని ప్రస్తావనలు ఉన్నాయి. అలాగే ప్రస్తుతమున్న ఐవీఎఫ్‌ పద్ధతులు బిడ్డలు లేనివారికి పిల్లలు పుట్టేలా చేస్తున్నాయి.
Tags:    

Similar News