అసెంబ్లీ మీడియా హాల్లో రేవంత్ కు అనుమ‌తి లేదా?

Update: 2019-07-27 05:02 GMT
కోపంతో త‌న విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించారు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. విలేక‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హించుకున్న ఆయ‌న‌కు అనుమ‌తి విష‌యంలో అధికారులు వ్య‌వ‌హ‌రించిన తీరుతో ఆయ‌న అగ్గిలం మీద గుగ్గిలం అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా హాల్ లో మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించాల‌ని భావించారు.

అయితే.. రేవంత్ రెడ్డి మీడియా స‌మావేశానికి అసెంబ్లీ కార్య‌ద‌ర్శి అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీంతో ఆగ్ర‌హం చెందిన రేవంత్ రెడ్డి.. ప్రెస్ మీట్ పెట్ట‌టానికి ఎందుకు అనుమ‌తించ‌ర‌ని ప్ర‌శ్నించారు. దీనికి నిబంధ‌న‌లు ఒప్పుకోవ‌ని ఆయ‌న చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. తాను ఎంపీన‌ని.. త‌న‌కు ప్రెస్ మీట్ పెట్టుకోవ‌టానికి హ‌క్కు ఉంటుంద‌ని.. ప‌ర్మిష‌న్ ఇవ్వాల్సిన బాధ్య‌త అధికారుల‌కు ఉంద‌ని వాదించిన‌ట్లు స‌మాచారం.

అయిన‌ప్ప‌టికీ స‌సేమిరా అన్న అధికారులపై తీవ్రంగా ఫైర్ అయిన ఆయ‌న‌.. ఒక‌వేళ త‌న ప్రెస్ మీట్ కు అనుమ‌తి ఇవ్వ‌ని ప‌క్షంలో లోక్ స‌భ స‌భ్యుడిగా త‌న‌కున్న హ‌క్కుల్ని కాల‌రాసే ప్ర‌య‌త్నం చేస్తే.. ప్రివిలేజ్ మోష‌న్ ఇవ్వాల్సి వ‌స్తుందంటూ వార్నింగ్ ఇచ్చేశారు.

రేవంత్ రెడ్డికి అసెంబ్లీ మీడియా హాల్ లో విలేక‌రుల స‌మావేశానికి అనుమ‌తి ఇస్తే ప్ర‌భుత్వం నుంచి త‌లంటు ఖాయం. అలా అని ఇవ్వ‌కుంటే రేవంత్ ఒక ప‌ట్టాన వ‌దిలే వ్య‌క్తి కాదు. ఎంపీగా త‌న‌కున్న అధికారాల చిట్టా త‌వ్వి తీసి.. ఆయ‌న హెచ్చ‌రించిన‌ట్లుగా ప్రివిలేజ్ మోష‌న్ కానీ ఇస్తే.. లేనిపోని త‌ల‌నొప్పులు తెచ్చుకున్న‌ట్లే. దీంతో.. కిందా మీదా ప‌డిన అధికారులు.. రూల్ బుక్ ను అర్జెంట్ గా తెప్పించి క్షుణ్ణంగా చెక్ చేసిన‌ట్లుగా స‌మాచారం.

అసెంబ్లీ మీడియా హాల్లో ప్రెస్ మీట్ పెట్టేందుకు ఒక ఎంపీకి హ‌క్కు ఉంటుంద‌న్న విష‌యాన్ని గుర్తించిన అధికారులు.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఆయ‌న మీడియా మీట్ కు ఓకే చెప్పార‌ట‌. త‌న ఆగ్ర‌హంతో అధికారుల్ని రూల్ బుక్ తిర‌గేసేలా రేవంత్ చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News