బాబు ఆస్తుల మీద పడ్డ ముద్రగడ

Update: 2016-02-07 08:32 GMT
కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రెండు ఎకరాలతో రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన బాబు.. అనతి కాలంలోనే రూ.2లక్షల కోట్లు ఎలా వెనకేశారో చెప్పాలంటూ మండిపడ్డారు. కాపుల్ని బీసీల్లో చేర్చే అంశాన్నే ఎజెండా చేసుకొని దీక్ష చేస్తున్న ముద్రగడ.. తాజాగా అందుకు భిన్నంగా చంద్రబాబు ఆస్తుల్ని ప్రస్తావించటం.. ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఒక అంశంపై ఉద్యమం చేస్తున్న వారు.. ఆ దిశగానే అడుగులు వేయాలే కానీ.. అందుకు సంబంధం లేని అంశాల్ని ఉద్యమంలోకి తీసుకురావటం ఉద్యమాన్ని బలహీనపరిచే అవకాశం ఉంది. చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయాలని ముద్రగడ అనుకొని ఉంటే.. అందుకు తగ్గట్లు బలమైన ఆధారాలు సేకరించి.. వాటిని విడుదల చేస్తూ బాబు ఇలా చేశారని చెప్పటం అర్థం ఉంది. అందుకు భిన్నంగా.. సగటు రాజకీయ నేత మాదిరి విమర్శలు.. ఆరోపణలు చేయటం ఉద్యమాన్ని బలహీనపర్చినట్లు అవుతుందే తప్ప మరొకటి కాదు.

అందుకే.. ఉద్యమాన్ని దెబ్బ తీసే ఈ తరహా వ్యాఖ్యలు ఏమాత్రం మంచిది కాదన్న వాదన వినిపిస్తోంది. చంద్రబాబు మొండి అయితే.. తాను జగమొండి అని.. తన లక్ష్యం నెరవేరే వరకూ తాను దీక్ష విరమించనని ముద్రగడ స్పష్టం చేశారు. అన్ని బాగానే ఉన్నా.. లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ చంద్రబాబు మీద ముద్రగడ ఆరోపణలు చేయటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో ఆయనకే తెలియాలి.
Tags:    

Similar News