​ములాయం ఆ మాటెందుకు అన్నాడు?​

Update: 2015-11-30 10:55 GMT
హైదరాబాద్  నగరం ఆదివారం ఉత్తరప్రదేశ్ కు చెందిన రాజకీయ ప్రముఖులతో కళకళలాడింది. ముఖ్యంగా సమాజ్ వాది పార్టీ నేతలు నగరానికి వచ్చారు. ఒకప్పటి సమాజ్ వాది పార్టీ ఎంపీ, అలనాటి అందాల నటి జయప్రద కుమారుడి వివాహం మొన్న హైదరాబాద్ లోనే జరిగిన సంగతి తెలిసిందే... ఆ పెళ్లి సందర్భంగా ఆదివారం రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. దీనికి సమాజ్ వాది పార్టీ అధినేత, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన ములాయం సింగ్ యాదవ్,  సమాజవాది పార్టీ మాజీ నేత అమర్ సింగ్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ములాయంను విలేకరులు చుట్టుముట్టగా ఆయన వారితో కాసేపు మాట్లాడారు. బీహార్ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామలపై విలేకరులు ప్రశ్నలు అడగ్గా... జయప్రద కుమారుడి వివాహ విందు కోసమే తాను వచ్చాను కానీ, రాజకీయ కారణాలు లేవని.. రాజకీయాలు మాట్లాడేందుకు తాను త్వరలో మరోసారి హైదరాబాద్ వస్తానని ములాయం చెప్పారు. దీంతో ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. హైదరాబాద్ కేంద్రంగా ములాయం సాగించనున్న రాజకీయం ఏంటి.. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుస్తారా... కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి కట్టే ప్రయత్నాల్లో భాగంగా కేసీఆర్ నూ కలుపుకొని పోయేందుకు ములాయం స్వయంగా రంగంలోకి దిగుతారా అన్న చర్చలు మొదలయ్యాయి. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిసేందుకు హైదరాబాద్ రాబోతున్నారా అన్న చర్చా జరుగుతోంది. అయితే.. ములాయం యథాలాపంగా అన్న మాటలే తప్ప ఆయన సీరియస్ గా చెప్పిన మాటలు కావని అంటున్నారు. ఏదేమైనా ములాయం మాటలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకే దారితీశాయి.

ఆదివారం మధ్యాహ్నం జయప్రద ఇంటికి వచ్చిన ములాయం, అమర్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం రాత్రి తిరిగి లక్నో వెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లోని ఏ పార్టీ నేతలూ ప్రత్యేకంగా ఆయన్ను కలవడం కానీ, ఆయన ఎవరినీ ప్రత్యేకంగా కలవడం కానీ జరగలేదు.
Tags:    

Similar News