చిత్రవిచిత్రమైన మలుపుల్లో తండ్రీ కొడుకుల లొల్లి

Update: 2017-01-09 15:22 GMT
ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన వేళలోనూ సమాజ్ వాదీ పార్టీలో ములాయంసింగ్ కు.. ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్ కు మధ్య నడుస్తున్న లొల్లి అంతకంతకూ ముదురుతోంది. ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా రెండు వర్గాలు వారు చేస్తున్న ఆరోపణలు.. ప్రతి ఆరోపణలతో ఏ నిమిషాన ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సమాజ్ వాదీ పార్టీ ఎవరిదన్న అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం వద్ద తండ్రీ.. కొడుకులు కుస్తీ పడుతున్న వేళ.. మెజార్టీ పార్టీ ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల మద్దతు తమకుందని పేర్కొంటూ.. అఫిడవిట్లను పెద్దఎత్తున సేకరించిన అఖిలేశ్ యాదవ్వర్గానికి చెందిన రాంగోపాల్ యాదవ్ ఎన్నికల సంఘానికి అందించారు. ఇదిలా ఉంటే.. ఈ అఫిడవిట్లలో పేర్కొన్న సంతకాలన్నీ ఫోర్జరీవిగా పేర్కొంటూ ములాయం వర్గం ఆరోపిస్తోంది.

ఇదిలా ఉంటే.. అఖిలేశ్ వర్గంపై ములాయం సింగ్ సోదరుడు సరికొత్త వీడియో బాంబును పేల్చరు. అఖిలేశ్ వర్గం తమకు మోటారు సైకిల్ గుర్తు కావాలని ఎన్నికల సంఘాన్ని కోరిందని చెబుతూ.. ఇందుకు సంబంధించిన ప్లాన్ నెల రోజుల క్రితమే ఎన్నికల కమిషన్ ను కలిసి కోరినట్లుగా ఆయనఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ఆయన విడుదల చేయటం సంచలనంగా మారింది.

ఇదిలా ఉంటే.. అఖిలేశ్ కు అండగా ఉన్న రాంగోపాల్ యాదవ్ పై ఆరేళ్లు పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్న ములాయం.. తాజాగా ఆయనపై ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీకి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నుంచి రాంగోపాల్ ను బహిష్కరించిన విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్ అయిన ఉప రాష్ట్రపతికి వివరిస్తూ.. ఆయన్ను రాజ్యసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరి..దీనిపై ఉప రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు తండ్రి.. కొడుకుల మధ్య నడుస్తున్న వివాదాన్ని ఏదో ఒక రూపంలో సెటిల్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు యూపీ మంత్రి ఆజం ఖాన్. ములాయం.. అఖిలేశ్ మద్య మంచు మేఘాలు కమ్ముకున్నాయనే కానీ.. వారిద్దరి మధ్య చీకట్లు అలుముకోలేదని వ్యాఖ్యానించటం గమనార్హం. వారిద్దరి మధ్య వారధిగా నిలుస్తూ రాజీ కోసం ఎడతెగని ప్రయత్నాల్ని చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తండ్రీకొడుకుల మధ్య ఇంత పెద్దస్థాయిలో లొల్లి జరుగుతున్నా.. అఖిలేశ్ ఇద్దరు ముద్దుల కూతుళ్లు మాత్రం తన తాత ములాయం సింగ్ ను కలిసేందుకు వెళుతూనే ఉన్నారట. కొద్దిరోజుల క్రితం అఖిలేశ్ కుమార్తెలు అదితి (15)..టీనా (10)లు తాత ములాయంను కలిశారని.. ఈ సందర్భంగా మీ నాన్న చాలా మొండోడు అని వ్యాఖ్యానించారని.. అదే విషయాన్ని తండ్రి అఖిలేశ్ కు చెప్పగా.. తాను మొండివాడిననే చెప్పుకున్నారట. మొత్తానికిరాజకీయ వైరుధ్యంలో.. విరోధం ఎలా ఉన్నా.. కుటుంబ సభ్యుల మధ్య మాత్రం వ్యక్తిగత సంబంధాలు బాగుండటం కొంతలో కొంత మేలైన అంశంగా చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News