ఉత్తర్ ప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీ ఇపుడు కొత్త వార్తలతో తెరమీదకు వచ్చింది. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ - ఆయన తనయుడు - యూపీ సీఎం అఖిలేశ్ సైకిల్ గుర్తు కోసం తీవ్ర పోరు సాగిస్తుంటే, ములాయం చిన్న కొడుకు ప్రతీక్.. రూ.5 కోట్ల విలువగల విలాసవంతమైన లంబొర్ఘిని హురకాన్ కారులో తిరుగుతూ జల్సా చేస్తున్నారు. తన ఖరీదైన కారు - కుక్కపిల్ల బ్రౌని పక్కన నిలబడి తన ఫొటోను సోషల్ మీడియాలో ఫొటో పోస్ట్ చేశారు. ములాయం రెండో భార్య పుట్టిన కొడుకు ప్రతీక్.
తండ్రి ములాయం - సోదరుడు అఖిలేష్ యాదవ్ రాజకీయ వేడిలో గరంగరంగా ఉంటే ప్రతీక్ మాత్రం అవేమీ పట్టనక్కర్లేకుండా.. తను జల్సాగా ఉన్న సందర్భాన్ని పోస్ట్ చేసి "నేను - బ్రౌని - బ్లూబోల్ట్" అంటూ తన పోస్ట్ కు కామెంట్ పెట్టేశారు. ఎస్పీ పరిణామాలను గమనించిన వర్గాల అభిప్రాయం ప్రకారం ప్రతీక్ కు రాజకీయాలపై ఆసక్తి లేదు. అతని భార్య అపర్ణకు రాజకీయాలపై ఆసక్తి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఈమె పోటీ చేయడానికి నిర్ణయించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అపర్ణ రాజకీయ ప్రవేశాన్ని అడ్డుకోవడమే సీఎం అఖిలేశ్ వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు. సమాజ్ వాది అంటే సోషలిస్టు అని అర్థం. సోషలిస్టుల భావజాలంలో సమానత్వం కీలకమైనది. సంపద ఒకరి దగ్గరే పోగుపడి ఉండడాన్ని వారు అసహ్యించుకుంటారు. సంపదను అందరికీ పంపిణీ చేయాలనేది వారి వాదన. అటువంటి వ్యక్తుల వద్ద రూ.5 కోట్ల ఖరీదైన కారు ఉండడమంటే విమర్శలకు తావిచ్చినట్లేనని పలువురు చెప్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/