ట్రాన్స్ జెండర్స్ పై మొదలుపెట్టిన ట్రంప్.. పోస్ట్ వైరల్!
ట్రాన్స్ జెండర్స్ విషయంలో ట్రంప్ ఒక బలమైన వైఖరి కలిగి ఉన్నారని చెబుతుంటారు.
ట్రాన్స్ జెండర్స్ విషయంలో ట్రంప్ ఒక బలమైన వైఖరి కలిగి ఉన్నారని చెబుతుంటారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని బలంగా నొక్కి చెప్పారు. వాస్తవానికి ట్రంప్ తొలిసారి ప్రెసిడెంట్ అయినప్పుడే.. ట్రాన్స్ జెండర్లు సాయుధ దళాల్లో చేరకుండా ఉత్తర్వ్యులు ఇచ్చారు. అయితే.. అప్పటికే మిలటరీలో పనిచేస్తున్నవారిని కంటిన్యూ చేశారు.
ఇక ఇటీవల ప్రమాణస్వీకారానికి ముందు నిర్వహించిన ర్యాలీలో.. మహిళల క్రీడల్లో ట్రాన్స్ జెండర్స్ పాల్గొనకుండా నిలువరిస్తానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇటీవల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకాలు చేశారు. ఈ క్రమంలో తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... ఆ దేశ మిలటరీ విభాగంలో ట్రాన్స్ జెండర్స్ నియామకాన్ని నిషేధించారు.
అవును... మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్ జెండర్స్ పాల్గొనడాన్ని ఇప్పటికే నిషేధించిన ట్రంప్.. తాజాగా మిలటరీ విభాగంలోనూ ట్రాన్స్ జెండర్ నియామకాన్ని నిషేధించారు. ఈ మేరకు యూఎస్ సైన్యం ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఇదే సమయంలో... సర్వీసుల్లో ఉండగా లింగ మార్పిడి విధానాలను అనుమతించబోమని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా... అమెరికాకు సేవ చేయాలనుకునే జెండర్ డిస్ఫోరియా వ్యక్తులను తాము గౌరవిస్తామని.. అయితే, తమను తాము ట్రాన్స్ జెండర్ గా భావించే వారి నియామకాలను ఆపేస్తున్నామని.. ఇప్పటికే సర్వీసుల్లో ఉన్నవారు లింగమార్పిడి చేయించుకొవడానికి సంబంధించిన వైద్య ప్రక్రియలను నిలిపేస్తున్నామని.. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.
కాగా... కొన్ని నెలల క్రితం ఒలింపిక్స్ వేదికగా అల్జీరియాకు చెందిన ఇమానె ఖెలిఫ్ కు సంబంధించిన విషయంలో లింగ వివాదం తీవ్రంగా నడిచిన సంగతి తెలిసిందే. నాడు ఆ వ్యవహారంపై స్పందించిన నాడు మాజీ ప్రెసిడెంట్ గా ఉన్న డొనాల్డ్ ట్రంప్.. మహిళల ఆటలో పురుషులు లేకుండా చేస్తానని వ్యాఖ్యానించారు. ఆ విషయం అప్పట్లో సంచలనంగా మారింది.
మరోపక్క ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన డెమోక్రటిక్ సభ్యురాలు, ట్రాన్స్ జెండర్ సారా మెక్ బ్రైడ్ ను మహిళల బాత్ రూమ్ లోకి అనుమతించబోమని రిపబ్లికన్లు ప్రత్యేక తీర్మానం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్థాయిలో ట్రాన్స్ జెండర్ల హక్కులపై రిపబ్లికన్ పార్టీ నేతలు బలమైన అభిప్రాయాలను కలిగి ఉంటారని అంటారు!