మాజీ సీఎంలలో ఎవరేంటో తేల్చేసిన నాదెండ్ల

Update: 2017-06-29 06:14 GMT
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు చెబితే చాలు విరుచుకుపడే మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి పలువురు మాజీ ముఖ్యమంత్రుల వరకు ఎవరేంటో చెప్పేశారు. ఎన్టీఆర్ ను పదవి నుంచి దించాక తానెందుకు ఫెయిలయ్యాను.. చంద్రబాబు ఎందుకు సక్సెస్ అయ్యారనేది కూడా ఆయన వివరించారు. రీసెంటుగా నాదెండ్ల చేసిన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి.
    
చంద్రబాబు వైఖరి తనకు ఎంతమాత్రమూ నచ్చట్లేదని చెప్పిన నాదెండ్ల భాస్కరరావు.... చంద్రబాబు మళ్లీ పాలనను విజయవాడ నుంచి హైదరాబాద్ కు మార్చాలని అనుకుంటున్నారని అన్నారు.  హైదరాబాదులో కేసు(ఓటుకు నోటు) పడేసరికి విజయవాడ వచ్చేశారని... కానీ... ఇప్పుడు విజయవాడలో సరిగ్గా లేదు, మళ్లీ వెనక్కు వెళ్లాల్సిందేనని  నాకు చెబుతున్నాడని ఆయన అన్నారు. రాష్ట్రం ఏమై పోతోంది? డబ్బంతా ఏమైపోతోంది? అని చంద్రబాబును అడిగేవారే లేరని ఆయన అన్నారు.
    
రెండెకరాల పొలంలో కూలిపని చేసుకుంటూ అలా అలా పైకి వచ్చిన చంద్రబాబు, తాను మంత్రి అయిన సమయంలో తన దగ్గరే ఉండేవాడని నాదెండ్ల చెప్పారు. ప్రస్తుతం చంద్రబాబు గొప్ప నేతగా పేరు తెచ్చుకున్నారని, కానీ కొంత కాలం వేచి చూస్తే, అసలు రంగు బయటపడుతుందని ఆయన విమర్శించారు.  అతను ఎన్టీఆర్ ఇంట్లో ఉండడం వల్ల ఎన్టీఆర్ గోచీని వెనకనుంచి సులువుగా లాగగలిగాడంటూ చంద్రబాబు సక్సెస్ ఫుల్ వెన్నుపోటును ప్రస్తావించారు.
    
రాజకీయాలు నేర్చుకోవాలంటే కాసు బ్రహ్మానందరెడ్డి నుంచి నేర్చుకోవాలని, జలగం వెంగళరావు ఎమర్జెన్సీ సమయంలో విజయవంతమైన నేతగా పేరు తెచ్చుకున్నారని, పీవీ నరసింహరావు గురించి లోకానికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయంటూ ఆయన మాజీ సీఎంల గురించి చెప్పుకొచ్చారు. భవనం వెంకట్రామిరెడ్డి అసలు ఓ ముఖ్యమంత్రే కాదని, అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదని తేల్చేశారు. నేదురుమల్లి జనార్దనరెడ్డిని కూడా భవనంతోనే పోల్చారు. అంజయ్యతో పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించింది తానేనని అన్నారు. తెలుగు ప్రజలు మంచి నేతలను వదిలి దోపిడీ దొంగలను ఎన్నుకున్నారని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News