చంద్రబాబు ప్లేసులో రతన్ టాటా

Update: 2021-10-18 05:10 GMT
చంద్రబాబునాయుడు ప్లేసులో రతన్ టాటా అంటే తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడిగా అనుకునేరు. కానేకాదు కేవలం విజయవాడ ఎంపి కేశినేని నాని పేరుతో వెలసిన ఫ్లెక్సీలు, పోస్టర్లలో మాత్రమే. కొద్ది కాలంగా విజయవాడ ఎంపి కేశినేని వ్యవహారం అధినేత చంద్రబాబుకు బాగా తలనొప్పిగా మారిన విషయం అందరికీ తెలిసిందే. 2024 ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీచేయటం లేదని, కాబట్టి తన స్ధానంలో కొత్త అభ్యర్ధిని చూసుకోమని నాని గతంలోనే చంద్రబాబుకు చెప్పినట్లు ప్రచారం జరిగింది.

ఒకసారి ఈ ప్రచారాన్ని నాని ఖండించినట్లు మరోసారి ప్రచారం నిజమే అని తన మద్దతుదారులతో చెప్పినట్లు జరుగుతున్న ప్రచారంతో పార్టీలో గందరగోళంగా మారింది. వచ్చే ఎన్నికల్లో పోటీ విషయాన్ని పక్కనపెట్టేస్తే చంద్రబాబుతో నానికి గ్యాప్ వచ్చిందన్నది మాత్రం వాస్తవం. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు తారాస్ధాయికి చేరుకోవటంతోనే నానికి పార్టీలో ఇబ్బందులు మొదలయ్యాయి. విజయవాడలోనే కీలక నేతలుగా ఉన్న బోండా ఉమ, బుద్ధా వెంకన్న, నాగూల్ మీరాతో నానికి ఏమాత్రం పడటంలేదు.

మొన్ననే జరిగిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా పై రెండు వర్గాల మధ్య వివాదాలు పీక్సుకు చేరుకుని రోడ్డునపడిపోయాయి. రెండు వర్గాలు మీడియా సమావేశాలు పెట్టుకుని మరీ ప్రత్యర్ధులను అమ్మనాబూతులు తిట్టుకోవటం పార్టీలో సంచలనంగా మారింది. వీళ్ళ మధ్య చంద్రబాబు సయోధ్య చేయాలని ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తన కూతురు శ్వేతను మేయర్ అభ్యర్ధిగా ప్రకటించాలని నాని పట్టుబట్టారు.

నాని కూతురును వద్దని మరో నేతను మేయర్ అభ్యర్ధిగా పై ముగ్గురు నేతలు ప్రతిపాదించటంతో వివాదాలు తారాస్ధాయికి చేరుకున్నాయి. చివరకు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నిర్వహించిన రోడ్డుషోల్లో కొన్ని చోట్ల నాని పార్టిసిపేట్ చేయలేదు. మరికొన్ని డివిజన్లో పై ముగ్గురు నేతలు డుమ్మా కొట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో చంద్రబాబుకు ఎంపికి మధ్య బాగా గ్యాప్ వచ్చేసింది. పార్టీ కార్యక్రమాల్లో కూడా నాని దాదాపు కనబడటంలేదు.

ఇలాంటి నేపధ్యంలోనే హఠాత్తుగా నాని ఆఫీసులో నుండి చంద్రబాబు, ఇతర నేతల ఫొటోలు ఒక్కసారిగా మాయమైపోయాయి. విజయవాడ పరిధి ఏడు అసెంబ్లీల్లోని టీడీపీ నేతల ఫొటోలు కూడా తీసేశారు. అన్నీ చోట్లా నానితో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన టాటా గతంలో దిగిన ఫెక్సీలనే పెట్టారు. అలాగే విజయవాడ పరిధిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న నాని+టాటా ఫొటోలే కనబడతున్నాయి. తాజా పరిణామాలతో రాబోయే ఎన్నికల్లో నాని పోటీ చేయటం లేదనే ప్రచారం మళ్ళీ ఊపందుకుంది. మొత్తానికి ఎంపి వ్యవహారం చంద్రబాబుకు పంటికింద రాయిలాగే తయారైందని తెలుస్తోంది. ఈ వ్యవహారానికి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టకపోతే పార్టీ నష్టపోవటం ఖాయమే.


Tags:    

Similar News