చిన‌బాబూ... స‌మ‌స్య‌ల సృష్టే లక్ష్య‌మా?

Update: 2017-04-18 11:17 GMT
టీడీపీ జాతీయ  ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఏపీ కేబినెట్‌ లో కీల‌క శాఖ‌ల మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నారా లోకేశ్ పెను వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మొన్న‌టికి మొన్న ఎమ్మెల్సీగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన సంద‌ర్భంగా నాలిక మ‌డ‌త‌తో విప‌క్షాల‌కు అడ్డంగా బుక్కైన లోకేశ్... ఆ త‌ర్వాత రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని జ‌యంతిని వ‌ర్ధంతిగా మార్చేసి... ఆ వర్ధంతికి కూడా శుభాకాంక్ష‌లు చెప్పి అంద‌రినీ ఆశ్య‌ర్యానికి గురి చేశారు. ఆ ఘ‌ట‌న‌కు సంబంధించి సోష‌ల్ మీడియాలో చిన‌బాబుకు పెద్ద ఎత్తున సెటైర్లు ప‌డిపోయాయి. అయినా కూడా ఆయ‌న త‌న నాలిక మ‌డ‌త‌ను మాత్రం వ‌దులుకునేందుకు సిద్ధంగా లేన‌ట్లు నేటి ఘ‌ట‌న‌తో నిరూపించుకున్నారు.

ఇక నేటి చిన‌బాబు నాలిక మ‌డ‌త విష‌యానికి వ‌స్తే... టీడీపీ సీనియ‌ర్ నేత‌ -  బాబు కేబినెట్‌ లో హోంమంత్రిగానే కాకుండా... డిప్యూటీ సీఎంగా ఉన్న నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌తో క‌లిసి తూర్పుగోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన నారా లోకేశ్.. ఆ జిల్లాలోని క‌ర‌ప‌లో జ‌రిగిన స‌భ‌లో అనర్గ‌ళంగా ప్ర‌సంగించారు. ఈ ప్ర‌సంగంలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారమే త‌న ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించడానికి బ‌దులుగా... రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో తాగు నీటి స‌మ‌స్య సృష్టే త‌న ల‌క్ష్యంగా చెప్పుకొచ్చారు. ఏదో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు చిన‌బాబు వ‌చ్చార‌ని సంతోష‌ప‌డ్డ క‌ర‌ప వాసులు ఆయ‌న నోట నుంచి స‌మ‌స్య‌ల సృష్టే ల‌క్ష్య‌మ‌న్న ప్ర‌క‌ట‌న విని ఒక్క‌సారిగా అవాక్క‌య్యారు.

చిన‌బాబు ప్ర‌సంగానికి ముందు మాట్లాడిన చిన‌రాజ‌ప్ప‌... నారా లోకేశే మ‌న భావి సీఎం అంటూ ప్ర‌క‌టించిన మ‌రుక్ష‌ణ‌మే లోకేశ్ నోట ఈ స‌మ‌స్య‌ల సృష్టి మాట విన‌ప‌డటం గ‌మ‌నార్హం. కాబోయే సీఎం హోదాలో వ‌చ్చేసిన చిన‌బాబు... స‌మ‌స్య‌ల సృష్టే త‌న ల‌క్ష్య‌మంటూ చేసిన ప్ర‌క‌ట‌న విన్న క‌ర‌ప వాసులు.. ఇక త‌మ స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించాల‌ని ఎవ‌రిని అడ‌గాలో అంటూ గుస‌గుస‌లాడుకున్న వైనం కూడా క‌నిపించింది.


Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News