ఆస్తులు ప్ర‌క‌టించిన నారా లోకేశ్‌

Update: 2015-09-26 09:53 GMT
రాజ‌కీయ నాయకులు ఆస్తుల ప్ర‌క‌టించ‌డం చాలా అరుదు. అయితే చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్నా...అధికారంలో ఉన్నా త‌న ఆస్తులు - అప్పులు ప్ర‌తి సంవ‌త్స‌రం రెగ్యుల‌ర్‌ గా ప్ర‌క‌టిస్తూనే వ‌స్తున్నారు. ఆయ‌న తిరిగి ఆంధ్రప్ర‌దేశ్ సీఎం అయిన త‌ర్వాత త‌న ఆస్తుల‌ను ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు లోకేష్ కూడా తండ్రి బాట‌లోనే న‌డుస్తున్నారు. లోకేష్ త‌న ఆస్తులు-అప్పుల వివ‌రాల‌ను శ‌నివారం ట్విట్ట‌ర్‌ లో వెల్ల‌డించారు.  అనంత‌రం విలేక‌ర్ల స‌మావేశంలో కూడా ఈ వివ‌రాలు ఆయ‌న తెలిపారు. మొత్తం త‌న‌కు రూ.7.67 కోట్ల నిక‌ర ఆస్తి ఉంద‌ని తెలిపారు. అంతేగాక రూ.4.72 కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. అలాగే త‌న తండ్రి పేర  50 ల‌క్ష‌ల విలువైన ఆస్తులు, 8 ల‌క్ష‌ల అప్పులు ఉన్నాయ‌ని వివ‌రించారు. ఓవ‌రాల్‌ గా అప్పులు పోను త‌న తండ్రికి రూ.42 ల‌క్ష‌ల నిక‌ర ఆస్తులు ఉన్నాయ‌న్నారు.

  అలాగే త‌ల్లి భువ‌నేశ్వ‌రి పేర 33.07 కోట్లు, త‌న భార్య బ్ర‌హ్మ‌ణికి రూ.4.77 కోట్ల ఆస్తులు ఉన్నాయ‌న్నారు. త‌న భార్య బ్రాహ్మ‌ణి అప్పులు రూ.కోటికి త‌గ్గిన‌ట్టు లోకేష్ చెప్పారు.  త‌మ‌కు హెరిటేజ్ ద్వారా రూ.2073 కోట్ల‌ ఆదాయం వ‌స్తుంద‌ని, ఖర్చులు పోను సంవ‌త్స‌రానికి రూ.30 కోట్ల లాభాలు వస్తాయ‌ని వివ‌రించారు. ప్రస్తుతం త‌మ‌కు అప్పులు త‌గ్గాయ‌న్నారు. రూ.2 కోట్ల‌తో తాను ఫాంహౌస్ కూడా క‌ట్టుకున్న‌ట్టు లోకేష్ చెప్పారు. ఈ సంవ‌త్స‌రం రూ.6ల‌క్ష‌ల‌తో న‌గ‌లు కొనుగోలు చేశామ‌ని తెలిపారు.

 తాము పాలు, కూర‌గాయ‌ల వ్యాపారంతోనే బతుకుతున్నామ‌ని లోకేష్ చెప్పారు. తాము నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే వ్యాపారం చేస్తున్నామ‌ని , తమ కుటుంబంపై, తమ వ్యాపారాలపై ఎన్ని క‌మిటీలు వేసినా  నిల‌బ‌డ‌లేద‌ని లోకేశ్ గుర్తుచేశారు. ఐదేళ్లుగా ఆస్తులను ప్రకటిస్తున్నామని...అన్ని రాజకీయ పార్టీలు, నేతలు ఆస్తులను ప్రకటించాలని కోరారు.  ఆఫ్రికా - ఆగ్నేయాసియా దేశాల్లో కూడా హెరిటేజ్ సేవ‌లు ప్రారంభించాల‌నుకుంటున్నామ‌ని...సిమెంట్ ఫ్యాక్ట‌రీ - న్యూస్ ఛానెల్ పెడితే త‌మకు సంతృప్తి రాద‌ని ప‌రోక్షంగా జ‌గ‌న్‌ ను ఉద్దేశించి సెటైర్లు వేశారు.

లోకేష్ ప్ర‌క‌టించిన ఆస్తుల వివ‌రాలు: (రూ)

నారా చంద్ర‌బాబు నాయుడు :

ఆస్తులు -  50 ల‌క్ష‌లు

అప్పులు - 8 ల‌క్ష‌లు

నిక‌ర ఆస్తులు - 42 ల‌క్ష‌లు

నారా భువ‌నేశ్వ‌రి:

ఆస్తులు - 43.20 కోట్లు

అప్పులు - 10.12 కోట్లు

నిక‌ర ఆస్తులు - 33.07 కోట్లు

నారా లోకేష్‌:

ఆస్తులు - 12.39 కోట్లు

అప్పులు - 4.72 కోట్లు

నిక‌ర ఆస్తులు - 7.67 కోట్లు

నారా బ్రాహ్మ‌ణి:

ఆస్తులు - 5.14 కోట్లు

అప్పులు - 36 ల‌క్ష‌లు

నిక‌ర ఆస్తులు - 4.77 కోట్లు

నిర్వాణ హోల్డింగ్స్‌:

ఆస్తులు - 27.81 కోట్లు

అప్పులు - 26.44 కోట్లు

నిర‌క ఆస్తులు - 1.37 కోట్లు

Tags:    

Similar News