నరసింహన్ 12ఏళ్ల రికార్డ్.. ఉంటాడా? ఊడుతారా?

Update: 2019-07-15 13:56 GMT
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 12 ఏళ్లు.. రెండు భిన్నమైన శత్రుపార్టీల నేతలను మచ్చిక చేసుకొని ఇన్నాళ్లు గవర్నర్ పదవిలో కొనసాగడం అంటే మాటలు కాదు..కానీ మన గవర్నర్ నరసింహన్ దాన్ని చేసి చూపించారు. భిన్న ధృవాలైన రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను ఒకే సమయంలో ఇద్దరినీ సంతృప్తి పరచడం.. వారికి మనన్నలు పొంది గవర్నర్ గా కొనసాగడం అంటే నరసింహన్ రాజనీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఒక పుష్కర కాలం 12 ఏళ్లు గవర్నర్ గా నరసింహన్ ఈ ఏడాదితో పూర్తి చేసుకోవడం పెద్ద విశేషంగా చెప్పవచ్చు. దేశంలో అస్సలు రాజకీయాలతో సంబంధం లేని మాజీ ఐపీఎస్ అధికారి నరసింహన్ ఇలా ఎక్కువ కాలం గవర్నర్ గా పనిచేయడం ఆయన పనితీరుకు అద్ధం పడుతోంది.

2007లో నిఘా విభాగంలో పనిచేసి రిటైర్ అయిన నరసింహన్ ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కల్లోలిత మావోయిస్టుల ప్రాబల్యమైన చత్తీస్ ఘడ్ గవర్నర్ గా నియమించింది. ఇక ఆ తర్వాత 2009లో వైఎస్ మరణం.. తెలంగాణ ఉద్యమం తెరపైకి రావడం.. ఏపీ కల్లోలితంగా మారడంతో ఏపీ గవర్నర్ గా 2009 డిసెంబర్ లో మార్చింది. తెలంగాణ ఉద్యమాన్ని ఆందోళనలను గవర్నర్ గా నరసింహన్ చాకచక్యంగా పరిష్కరించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ సర్కారు వచ్చినా నరసింహన్ ను మోడీ ప్రభుత్వం మార్చలేదు. జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ క్లాస్ మేట్ అయిన నరసింహన్ ఆ పలుకుబడితో అటు మోడీ, నాటి హోంమంత్రి రాజ్ నాథ్, ప్రస్తుత హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులతో ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఇప్పటికే నలుగురు సీఎంలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్, వైఎస్ జగన్ ల చేత ప్రమాణం చేయించి అయిదుగురు సీఎంలతో కలిసి పనిచేయడం నరసింహన్ ప్రత్యేకత. జూలై 10తో నరసింహన్ 12 ఏళ్ల గవర్నర్ గిరీని పూర్తి చేసుకున్నారు. మరి గవర్నర్ గా మళ్లీ నరసింహన్ ను బీజేపీ ప్రభుత్వం పొడిగిస్తుందా? తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ వస్తారా  లేదా అనేది బడ్జెట్ సమావేశాల తర్వాత తేలనుంది.


Tags:    

Similar News