కొత్త బ‌జ్‌ : గ‌వ‌ర్న‌ర్ మూడ్రోజుల ఢిల్లీ టూర్?

Update: 2017-07-11 14:19 GMT
తెలుగు రాష్ర్టాల గ‌వ‌ర్న‌ర్ ఈఎస్‌ ఎల్‌ నరసింహన్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న మ‌రోమారు ఆస‌క్తిక‌రంగా మారింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం గ‌వ‌ర్నర్‌ ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం ఈ నెల 24వ తేదీన ముగియనుండటంతో బుధవారం రాత్రి ఆయన అన్ని రాష్ట్రాల గవర్నర్లు - లెఫ్ట్‌ నెంట్‌ గవర్నర్లకు విందు ఇస్తున్నారు. రాష్ట్రపతి భవన్‌ లో జరిగే ఈ కార్యక్రమానికి గవర్నర్‌ హాజరవుతారు. అయితే ఈ కార్య‌క్రమానికి రెండు రోజుల ముందే గ‌వ‌ర్న‌ర్ ఢిల్లీకి వెళ్ల‌డం - కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత మ‌రో రోజు హ‌స్తిన‌లోనే ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఉపరాష్ట్రపతి ఎన్నికకు సన్నాహాలు జరుగుతున్న క్రమంలో గవర్నర్‌ ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నరసింహన్‌ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు కొంతకాలంగా బలంగా ప్రచారం జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజా ప‌ర్య‌ట‌న‌లో కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ తో గ‌వ‌ర్న‌ర్ స‌మావేశం ఉండటం కూడా ఆస‌క్తిక‌రంగా మారింది. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో అవకాశాన్ని బట్టి ప్రధాని నరేంద్రమోడీని - కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ కల‌వ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ సంద‌ర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితుల గురించి వివరించే అవకాశం ఉంది. తరువాత ఆయన ఈనెల 14వ తేదీన చెన్త్నెకి వెళ్లి 15న తిరిగి హైదరాబాద్‌ కు చేరుకుంటారని సమాచారం.

కాగా,  2007లో యూపీఏ ప్రభుత్వం నరసింహన్‌ ను తొలుత ఛత్తీస్‌ గఢ్‌ గవర్నర్‌ గా నియమించింది. తెలంగాణ ఉద్య‌మం పెద్ద ఎత్తున జ‌రుగుతున్న స‌మ‌యంలో జనవరి 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు బదిలీ చేసింది. రాష్ట్ర విభజన స‌మ‌యంలో ప‌రిస్థితుల‌ను మెరుగైన రీతిలో స‌మ‌న్వ‌యం చేయ‌గ‌లిగార‌ని కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద మంచి అభిప్రాయం ఉంది. అందుకే బీజేపీ ప్ర‌భుత్వం సైతం ఆయ‌న సేవ‌లను నిలిపివేయ‌లేదు. ఎన్డీఏ పాల‌న‌లో కూడా గ‌వ‌ర్న‌ర్ పదవీ కాలాన్ని మూడుసార్లు పొడిగించింది.  దీంతో ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వికి సైతం న‌రసింహ‌న్ అభ్య‌ర్థిత్వాన్ని ప‌రిశీల‌న‌లోకి తీసుకుంటార‌నే అభిప్రాయం వినిపిస్తోంది.
Tags:    

Similar News