రేపు `2జీ` తీర్పు..నేడు క‌నిమొళితో మోదీ భేటీ!

Update: 2017-11-06 14:07 GMT
మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణానంత‌రం త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ర‌సకందాయంలో ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఏఐడీఎంకేలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు - సీఎం కుర్చీ కోసం కుమ్ములాట‌లు - జయ‌ల‌లిత నిచ్చెలి శ‌శిక‌ళ జైలుకు వెళ్ల‌డం - ర‌జ‌నీకాంత్‌ రాజ‌కీయ అరంగేట్రంపై ఉత్కంఠ‌ - క‌మ‌ల్  పొలిటిక‌ల్ ఎంట్రీ ప్ర‌క‌ట‌న‌ వంటి ప‌రిణామాలతో త‌మిళ రాజ‌కీయాలు పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీని త‌ల‌పిస్తున్నాయి. త‌మిళ‌నాట రాజ‌కీయ అస్థిర‌త‌ను క్యాష్ చేసుకొని అక్క‌డ పాగా వేయాల‌ని భావిస్తోన్న బీజేపీ ఏఐడీఎంకేకు ద‌గ్గ‌ర‌య్యేందుకు పావులు క‌దుపుతోంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాట ఓ అనూహ్య ఘ‌ట‌న జ‌రిగింది. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధాని మోదీ.... తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి - డీఎంకే పార్టీ అధినేత‌ ఎం. కరుణానిధిని కలిశారు. అయితే, దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన 2జీ స్టెక్ట్రమ్ స్కాం తీర్పు వెలువడడానికి ఒక‌రోజు ముందు క‌రుణానిధిని మోదీ క‌ల‌వ‌డం పై త‌మిళ‌నాట తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. 2జీ స్టెక్ట్రమ్ కుంభ‌కోణంలో కరుణానిధి కుమార్తె కనిమోళి కూడా నిందితురాలిగా విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

దేశ‌వ్యాప్తంగా పెనుదుమారం రేపిన 2జీ స్పెక్ట్రమ్ కుంభ‌కోణం కేసు తీర్పు రేపు వెలువ‌డ‌నుంది. దానికి ఒక్క రోజు ముందు క‌రుణానిధితో భేటీ కావాలని ఆయన కుటుంబ సభ్యులు మోడీని ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని మ‌న్నించిన మోదీ.....కరుణానిధి ఇంట్లో 15 నిమిషాలకు పైగా గ‌డిపారు. కరుణానిధి చేతులు పట్టుకొని మ‌రీ ఆయన ఆరోగ్యం గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలోని తన నివాసానికి రావాల‌ని కరుణానిధిని....మోదీ స్వయంగా ఆహ్వానించారు. మోదీ త‌మ ఇంటికి వ‌స్తున్నాడ‌ని తెలుసుకున్న స్టాలిన్ త‌న షార్జా ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకొని మ‌రీ సోమవారం ఉదయం చెన్నై చేరుకున్నారు. స్టాలిన్ - కనిమోళిల‌తో మోదీ జోకులు వేస్తూ ఉల్లాసంగా మాట్లాడారు. అయితే, 2జీ స్కాం కేసు తీర్పు రావ‌డానికి ఒక్క రోజు ముందు కరుణానిధి కుటుంబ సభ్యులను మోదీ కలవడం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

కరుణానిధి కుటుంబంతో మోదీ భేటీకీ రాజ‌కీయ ప్రాధాన్య‌త లేద‌ని డీఎంకే వర్గాలు అంటున్నాయి. కేవ‌లం క‌రుణానిధి ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు వారి ఇంటికి వెళ్లిన‌ట్లు తెలిపాయి. త‌మిళ‌నాట సీనియ‌ర్ నాయ‌కుడైనందు వ‌ల్లే ఆయ‌న‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి యోగ‌క్షేమాలు తెలుసుకున్నార‌ని చెప్పాయి. అన్నాడీఎంకే పార్టీ నాయకులతో మోదీకి సన్నిహిత సంబంధాలున్నాయి. అందులోనూ, డీఎంకే పార్టీ నాయకులు ప్రధానిపై సంద‌ర్భానుసారంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ భేటీ విష‌యం అన్నాడీఎంకే పార్టీ నాయకులకు మింగుడుప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు త‌మ‌కు ప్ర‌ధాని మ‌ద్ద‌తు ఉంద‌ని భావించిన‌ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి - ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు ...ఈ భేటీ త‌ర్వాత అయోమ‌యానికి గురైన‌ట్లు తెలుస్తోంది.అయితే, ఇప్ప‌టివ‌రకు ఏఐడీఎంకే త‌ర‌పు నుంచి ఈ భేటీపై ఎవ‌రూ స్పందించ‌లేదు.
Tags:    

Similar News