అమ‌రావ‌తి కంటే ఆ దేశానికే ఎక్కువ ఆర్థిక‌సాయం!

Update: 2018-07-25 04:59 GMT
ఇంట్లో వారికి భోజ‌నం పెట్ట‌రు కానీ.. ప‌క్క ఊరికి వెళ్లి అన్న‌దానం చేసిన‌ట్లుగా ఉంది ప్ర‌ధాని మోడీ తీరు చూస్తుంటే. తాను ప్ర‌ధాని అయ్యేందుకు వీలుగా హామీల మీద హామీలు ఇచ్చేసిన పెద్ద మ‌నిషి.. నాలుగేళ్ల‌లో ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి ఇచ్చిన ఆర్థిక సాయం రూ.1500 కోట్లు అది కూడా అంత‌ర్గ‌త డ్రైనేజీ కోస‌మే. నిజానికి ఆయ‌న విదిల్చిన ముష్టి.. ఆ ప‌నిని పూర్తిగా చేయ‌టానికైనా స‌రిపోతాయా?  అంటే.. కాద‌నే చెప్పాలి.

ఒక‌వైపు నిధుల కొర‌త‌తో ఏపీ కిందా మీదా ప‌డుతుంటే.. ఆదుకోవాల్సిన కేంద్రం హ్యాండిస్తున్న వైనం అంద‌రికి తెలిసిందే. ఏపీకి ఎవ‌రూ చేయ‌నంత దారుణ ద్రోహాన్ని చేసిన మోడీ ప‌రివారం తీరు చూస్తుంటే.. ఏపీ ప్ర‌జ‌లే కాదు ప‌క్క‌నున్న తెలంగాణ ప్ర‌జ‌లు సైతం అయ్యో అనే ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా మోడీ ఆఫ్రికా ఖండంలోని రువాండా దేశంలో ప‌ర్య‌టిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా రువేరు అనే గ్రామంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో నిరుపేద‌ల‌కు 200 ఆవుల్ని కానుక‌గా ఇచ్చారు. పేద‌రికం.. పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు కుటుంబానికి ఒక ఆవును పంపిణీ చేయ‌టం అక్క‌డ సంప్ర‌దాయంగా ఉంది. 2006 నుంచి ఈ కార్య‌క్ర‌మాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు.

ఆర్థిక ప్ర‌యోజ‌నాల కోసం రువాండాలోని మారుమూల గ్రామంలో ఆవుల‌కు ఇస్తున్న ప్రాధాన్య‌త భార‌తీయుల‌ను సంతోషానికి గురి చేస్తుంద‌ని మోడీ వ్యాఖ్యానించారు. తేనెటీగ‌ల పెంప‌కంపై కూడా దృష్టి పెట్టాల‌న్న స‌ల‌హాను ఇచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే..ఉగాండాకు భార‌త్ రూ.1377కోట్ల రుణ సాయాన్ని ఇస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఈ నిధుల్ని ఇంధ‌న మౌలిక వ‌స‌తులు..వ్య‌వ‌సాయం.. పాడి రంగాల అభివృద్ధికి వెచ్చించ‌నున్న‌ట్లు చెప్పారు.

ఎక్క‌డో మారుమూలన ఉన్న ఒక పేద దేశానికి రూ.1300 కోట్ల రుణ సాయాన్ని ఇచ్చేందుకు మోడీ నిర్ణ‌యం తీసుకున్నారే కానీ.. తాను ప‌లుమార్లు తిరిగిన ఏపీకి మాత్రం మొండిచేయి చూపించ‌టం గ‌మ‌నార్హం. నిరుపేద దేశాల‌కు రుణ సాయాన్ని ఇవ్వ‌టాన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌రు. దౌత్యంలో భాగంగా ఇలాంటివి చేస్తుంటారు. అర్థం చేసుకోవ‌చ్చు. కానీ.. ఆ గొప్ప‌ల‌న్ని ఎప్పుడు?  దేశంలోని ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్న‌ప్పుడు. ఒక‌ప‌క్క ఒక రాష్ట్ర ప్ర‌జ‌లు త‌మ‌కు ఇవ్వాల్సిన నిధుల కోసం ధ‌ర్మ‌బ‌ద్ధంగా గొంతెత్తి త‌మ వాద‌న‌ను వినిపిస్తుంటే ప‌ట్టించుకోకుండా ఉండ‌టాన్ని చూసిన‌ప్పుడు ఈ త‌ర‌హా పోలిక రాక మాన‌దు.


Tags:    

Similar News