రాహుల్ దెబ్బ‌కు దేశం వ‌ణికిందంటున్న ప్ర‌ధాని

Update: 2017-02-07 11:30 GMT
దేశం కోసం గాంధీలు ప్రాణాలు ఇచ్చార‌ని కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోదీ దీటుగా స‌మాధానం ఇచ్చారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంపై ధ‌న్య‌వాద తీర్మానం తెలుపుతూ ప్ర‌ధాని మోదీ ఇవాళ లోక్‌ స‌భ‌లో మాట్లాడారు. దేశం గురించి త‌క్కువ‌గా ఆలోచించే వాళ్లు త‌మ పార్టీలో ఎవ‌రూ లేర‌ని చెప్పారు. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల్లో త‌మ‌వాళ్లు అయిన సావార్‌ క‌ర్‌ - చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ ఉన్నార‌ని గుర్తు చేశారు. కాంగ్రెస్ మాత్రం త‌మ కుటుంబ‌స‌భ్యులే బ‌లిదానంలో పాల్గొన్నార‌ని భావిస్తుంద‌ని విమ‌ర్శించారు. సోమ‌వారం నాడు భూకంపం వ‌చ్చింద‌ని త‌న ప్ర‌సంగాన్ని మొద‌లుపెట్టిన ప్ర‌ధాని నిన్న‌నే భూకంపం ఎందుకు వ‌చ్చిందని ఆలోచిస్తున్నాని అన్నారు. భూమిని ఇంత లూటీ చేశారా అని ప్ర‌ధాని గ‌త పాల‌కుల‌ను విమ‌ర్శించారు. దీంతో విప‌క్షాలు ప్ర‌ధాని ప్ర‌సంగాన్ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశాయి. నేను మాట్లాడితే భూకంపం వ‌స్తుంద‌ని గ‌తంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఉద్దేశించి ప్ర‌ధాని చ‌మ‌త్కారంగా ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలుస్తుంది.

దేశంలో ప్ర‌జాస్వామ్యం పున‌ర్ స్థాపిత‌మైంద‌ని, అందుకే ఓ గ‌రిబీ బిడ్డ ప్ర‌ధాని అయ్యార‌ని న‌రేంద్ర మోదీ అభిప్రాయ‌ప‌డ్డారు. చ‌రిత్ర‌ను అర్థం చేసుకోవాల‌ని - కాంగ్రెస్ పార్టీ పుట్ట‌క‌ముందే - 1857లో స్వాతంత్ర్య ఉద్య‌మం మొద‌లైంద‌న్నారు. ఆ ఉద్య‌మంలో ప్ర‌జ‌లంద‌రూ పాల్గొన్నార‌ని మోదీ అన్నారు. స్వాతంత్ర్య ఉద్య‌మంలో పాల్గొనే అవ‌కాశం మ‌న‌లో ఎవరికీ రాలేద‌ని, కానీ దేశం కోసం జీవించే హ‌క్కు ఉంద‌న్నారు. పెద్ద నోట్ల రద్దుపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ విపక్షాలు మాత్రం టీవీ బైట్లు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రధాని విమర్శించారు. మంచి నిర్ణయాలను రాజకీయాలతో జోడించరాదన్నారు. 1988లో బినామీ ప్రాపర్టీ చట్టాన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆమోదించలేదని ఆయన ప్రశ్నించారు. నల్లధనం బంగారం రూపంలోకి మారిందని ఖర్గే అన్న వ్యాఖ్యలను తాను ఏకీభవిస్తానని, మరి ఈ విషయాన్ని ఆయన ఎప్పుడు గుర్తించారని ప్రధాని ప్రశ్నించారు. నగదు డబ్బుతో మొదలయ్యే అవినీతి, ఆ తర్వాత బంగారం, బినామీగా మారుతుందన్నారు. బినామీ చట్టాన్ని వదిలేది లేదని ప్ర‌ధాన‌మంత్రి స్ప‌ష్టం చేశారు. ఎంత పోయిందని గతంలో ప్రశ్నించే వారు, ఇప్పుడు మాత్రం ఎంత రాబట్టారని అడుతున్నారని ప్రధాని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకోవడాన్ని మోదీ సమర్థించారు.

నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థ ట్రాక్ లో పడిందని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. నల్లధనం కలిగి ఉన్న వాళ్లను పట్టుకోవడంలో టెక్నాలజీ ఉపయోగపడిందన్నారు. చాలా పర్ఫెక్ట్ టైమ్ లో నోట్ల రద్దు ప్రక్రియను చేపట్టామన్నారు. నల్లకుబేరులపై సమాచారం పంచుకునేందుకు విదేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. గా ఆదాయాన్ని స్వచ్ఛందగా వెల్లడించే అనేక పథకాలను ప్రవేశపెట్టినట్లు మోదీ చెప్పారు. ఆ స్కీమ్ ద్వారానే బ్యాంకు ఖాతాల్లోనే లేని సొమ్మును బయటకు రప్పించినట్లు చెప్పారు. అక్రమ సంపాదనను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో ప్రగతి సాధిస్తున్నామన్నారు. డిజిటల్ పేమెంట్లపైన కూడా ప్రధాని మాట్లాడారు. ఈ-పేమెంట్ పద్ధతులను ప్రజలు స్వీకరించాలన్నారు. డిజిటల్ కరెన్సీనే భవిష్యత్తు అన్నారు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జరిగిన లావాదేవీలకు సంబంధించిన పూర్తి డేటా తమ దగ్గర ఉన్నట్లు ప్రధాని చెప్పారు. ఎన్డీఏ పాలన సమయంలో విద్యుత్తు వినియోగం పెరిగిందన్నారు. అన్ని ప్రభుత్వ పథకాలను పర్యవేక్షిస్తున్నామన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచన చేసినట్లుగా ఏకకాలంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు నిర్వహించే సమయం ఆసన్నమైందన్నారు. యూరియాకు వేప పూత చేస్తున్నట్లు వెల్లడించారు. చెరుకు పంట ఉత్పత్తి 15 శాతం పెరిగిందన్నారు. సర్జికల్ దాడి అతి పెద్ద నిర్ణయమన్నారు. దేశ సైన్యాన్ని ఎంత కీర్తించినా తక్కువే అన్నారు. అతి తక్కువ సమయంలోనే సైనికులు సర్జికల్ దాడులకు దిగారన్నారు. దేశ సైన్యం పూర్తి సామర్థ్యంగా ఉందన్నారు. దేశాన్ని ముందుకు నడిపించడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News