అధిష్టానాన్నే ఆడేసుకుంటున్న సిద్ధూ

Update: 2021-11-07 04:33 GMT
కాంగ్రెస్ పార్టీలో అధిష్టానాన్నే పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. గడచిన ఆరు మాసాలుగా సిద్ధూ ఏకంగా అధిష్టానాన్నే ఓ ఆటాడుకుంటున్నాడు. సిద్ధూ చెప్పినట్లు నడుచుకోలేక, అలాగని సిద్ధూని కంట్రోల్ చేయలేక అధిష్టానం నానా అవస్థలు పడుతోంది. సిద్ధూ అరాచకాలను భరించటం అధిష్టానం వల్ల కాకపోయినా తొందరలోనే రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏమీ చేయలేక నోరు మూసుకుని భరిస్తోంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ నియమించిన అడ్వకేట్ జనరల్, డీజీపీలను ఆ స్థానంలో నుంచి తప్పిస్తే కానీ పీసీసీ బాధ్యతలు నిర్వర్తించేది లేదని సిద్ధూ తెగేసి చెప్పారు. పీసీసీ అధ్యక్షునిగా కంటిన్యు అవుతాను కానీ బాధ్యతలు మాత్రం నిర్వర్తించేది లేదని సిద్ధూ ఏకంగా ముఖ్యమంత్రితో పాటు అధిష్టానానికే అల్టిమేటమ్ జారీచేశారంటే ఏమిటర్ధం ? సిద్ధూ అభ్యంతరాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా సీఎం వ్యవహారం కనబడుతోంది. నిజానికి ఒకపుడు వీరిద్దరు మంచి సన్నిహితులే.

అయితే  సీఎం అయిన తర్వాత చన్నీ స్వతంత్రంగా బాధ్యతలు నిర్వర్తించటాన్ని సిద్ధూ తట్టుకోలేకపోతున్నారు. ముందు మంత్రివర్గం కూర్పుపై గోల చేశారు. మంత్రులుగా ఎంపికైన వారికి నిరసనగా సిద్ధూ పీసీసీ అధ్యక్షునిగా  రాజీనామా చేశారు. తర్వాత అధిష్టానం మధ్యవర్తిత్వంతో బాగా బెట్టుచేసి చివరకు రాజీనామాను ఉపసంహరించుకున్నారు. అయితే వెంటనే అడ్వకేట్ జనరల్, డీజీపీ నియామకంపై గోల మొదలుపెట్టారు.

సిద్ధూ వ్యవహారం చూస్తుంటే ఏదో విషయంలో గోల చేయాలన్నట్లుగానే ఉంది. కెప్టెన్ అమరీందర్ రాజీనామా చేయగానే సీఎంగా అధిష్టానం తననే ఎంపిక చేస్తుందని సిద్ధూ ఆశించారు. అయితే ఊహించని విధంగా చన్నీ ఎంపికవ్వటంతో అప్పటినుండి అధిష్టానంతో పాటు చన్నీపై మండిపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలుపే టార్గెట్ గా పావులు కదుపుతున్న అధిష్టానం దళిత నేత అయిన చన్నీని సీఎం సీటులో కూర్చోబెట్టింది. పంజాబ్ కు మొదటి దళిత సీఎం చన్నీయే కావటం గమనార్హం.

అధిష్టానం వ్యూహాలు తెలిసినా కూడా సిద్ధూ బాగా కంపు చేసేస్తున్నారు. నిజానికి సిద్ధూని కాంగ్రెస్ లోకి చేర్చుకోవటమే అధిష్టానం చేసిన తప్పని చాలామంది సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. సిద్ధూ అరాచకాలను భరించలేకే బీజేపీ వదిలించుకున్నది. సిద్ధూ వ్యవహార శైలి తెలుసుకాబట్టే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా దూరంగా పెట్టింది. జరుగుతున్నది చూస్తు కూడా కాంగ్రెస్ సిద్ధూని తెచ్చి నెత్తిన పెట్టుకున్నది. దాని ఫలితాన్నే ఇపుడు పంజాబ్ కాంగ్రెస్ తో పాటు అధిష్టానం అనుభవిస్తున్నది. మరి ఎంతకాలం సిద్ధూ తనిష్టారాజ్యంగా వ్యవహరిస్తారో చూడాలి.
Tags:    

Similar News