అద్వానీ..మోడీల మధ్య దూరం పెంచే బుక్ రిలీజ్

Update: 2016-07-23 05:12 GMT
బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీకి.. ప్రధాని మోడీకి మధ్యనున్న గ్యాప్ గురించి అందరికి తెలిసిందే. అద్వానీ ఇష్యూలో మాత్రం మోడీని అందరూ వేలెత్తి చూపించే పరిస్థితి. మోడీ డైహార్ట్ ఫ్యాన్స్ తప్పించి మిగిలిన వారంతా మోడీని తీరును తప్పు పట్టేవారు. చేరదీసి.. ఇంత పెద్ద నాయకుడ్ని చేసిన తర్వాత మోడీ గురువుకే పంగనామాలు పెట్టినట్లుగా పలువురు కామెంట్లు చేస్తారు.

మోడీకి.. అద్వానికి మధ్యన ఇప్పుడున్న దూరం సరిపోదన్నట్లుగా.. తాజాగా వీరి మధ్య మరింత గ్యాప్ పెరిగేందుకు వీలుగా ఒక పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది. దాదాపు మూడు దశాబ్దాలుగా అద్వానీకి సహాయకుడిగా పని చేసిన విశ్వంభర్ శ్రీ వాత్సవ ఒక పుస్తకాన్ని రాశారు. ‘‘అద్వానీతో 32 ఏళ్లు’’ అన్న టైటిల్ తో రిలీజ్ అయిన పుస్తకంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇందులో కీలకమైన విషయానికి వస్తే.. 2013 సెప్టెంబరులో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి హాజరయ్యేందుకు అద్వానీ సిద్ధమయ్యారని.. ఒక దశలో కారులోకి ఎక్కి కూర్చున్నారని..అయితే.. అక్కడే ఉన్న ఆయన సన్నిహితులు ఆయన్ను ఇంట్లోకి వెళ్లిపోవాలని సలహా ఇచ్చినట్లుగా వెల్లడించారు. విశ్వంభర్ ప్రస్తావించిన పలు అంశాలకు సంబంధించి అద్వానీ అనుమతి లేదని. ఇలాంటి అంశాల్నిఆయన చెప్పుకోవటానికి ఇష్టపడరని.. అయినప్పటికీ ఆయన ఆమోదం లేకుండా ఈ అంశాల్ని పుస్తకంలో కోట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇవే కాక మరికొన్ని విషయాలు కూడా పుస్తకంలో ప్రస్తావించారని చెబుతున్నారు. అదేజరిగితే.. ఈ పుస్తకం పుణ్యమా అని ఇప్పటికే ఉన్న దూరానికి మించి మరింత దూరం పెరిగే ప్రమాదం ఉందని ముఖ్యనేతలు వ్యాఖ్యానించటం గమనార్హం.
Tags:    

Similar News