అగ్గి పుట్టిస్తున్న తమ్ముళ్ల ర్యాంకుల యవ్వారం

Update: 2015-08-05 04:19 GMT
ఆగస్టు వచ్చిందంటే చాలు.. తెలుగుదేశం పార్టీలో కలకలం మామూలే. అధినేత వైఖరి మీద ఇష్టం ఉన్నా లేకున్నా.. పవర్ లో ఉన్న నేపథ్యంలో బండి లాగించటం తప్పించి మరో మార్గం లేదని సర్దుకుపోయే వారు చాలామందే ఉన్నారు. ఉన్నట్లుండి.. ఎమ్మెల్యేలకు.. మంత్రులకు ర్యాంకులని చెబుతూ.. మొత్తం వ్యవహారాన్ని ఓపెన్ చేయకుండా.. అవసరానికి తగ్గట్లుగా లీకులు ఇచ్చుకుంటూ.. మీడియాలో వస్తున్న కథనాలు.. ఏపీ మంత్రుల్లో అగ్గి పుట్టిస్తున్నాయి.

ఈ ర్యాంకుల గోలేంది.. విస్తరణ మాటేమిటి.? ఆరోపణల కతేమిటి..? పదవి ఉంటుందా? ఉండదా? ఇలాంటి సందేహాలు మదిలో మెదులుతున్నా సమాధానం చెప్పే వారే లేని పరిస్థితి. అధినేత దగ్గర గోడు వెళ్లబోసుకోవాలంటే ఆయన అందుబాటులో లేరు. ఇక.. చినబాబు దగ్గర చనువు ఉన్నోళ్లు పరిస్థితి అంతే. టర్కీ టూర్ వెళ్లిన బాబు ఫ్యామిలీ కారణంగా తమ వేదనను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తెగ ఇబ్బంది పడుతున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఏపీకి చెందిన కొందరి మంత్రుల పేర్లు మాత్రమే మీడియాలో తరచూ రావటం.. వారిపై చేతకానివారిగా.. సమర్థత లోపించిన వారిగా ముద్ర వేస్తూ కథనాలు రావటం.. వారికి చెందిన మంత్రిత్వ శాఖల్లో అవినీతి భారీగా ఉందన్న ఆరోపణలతో వార్తలు రావటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ ఒక క్రమపద్ధతిలో సాగుతున్నాయని.. పొమ్మనలేక పొగబెడుతున్న చందంగా ఉందన్న మాట వినిపిస్తోంది.

దీనికి తోడు.. ర్యాంకుల గోలపై గగ్గోలు పెడుతున్నారు. ఈ ర్యాంకులకు ప్రాతిపదిక ఏమిటి? అన్న విషయంపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. ర్యాంకులు సరిగా లేని వారి విషయంలో పునరాలోచన తప్పదని.. వేటు పడుతుందన్న మాట వినిపించటం మంత్రులకు ముచ్చమటలు పట్టేలా చేస్తున్నాయి.

మంత్రులు నిమ్మకాయల చిన రాజప్ప.. కొల్లు రవీంద్ర.. అయ్యన్నపాత్రుడు.. పీతల సుజాత.. మృణాళిని.. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి.. పల్లె రఘునాధరెడ్డి నేతలపై నెగిటివ్ వార్తలు రావటం పట్ల వారి అనుచరులు తీవ్ర అసంతృప్తికి గురి అవుతున్నారు. అవినీతికి ఏ శాఖ అతీతం కాదని.. కానీ.. కొన్ని శాఖలపైనే టార్గెట్ చేసినట్లుగా రచ్చ చేయటం ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

చివరకు పరిస్థితి ఎలా తయారైందంటే.. పోతే పోయింది వెధవ పదవి.. నిత్యం ఈ అవమానాల కంటే పోయేది పోతే ఒకేసారి పోతుందని విసుక్కుంటున్న వారూ ఉన్నారు. మాట వరసకు అలా అంటారు కానీ.. ఎవరు మాత్రం మంత్రి పదవుల్ని వదులుకుంటారు..? అందుకే.. ఎవరికి వారు అధినేత దగ్గరకు వెళ్లి..‘‘వివరణ’’ ఇచ్చుకునే ప్రయత్నం చేయటంతో పాటు.. పలు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. మరి.. ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో కాలమే బదులివ్వాలి.
Tags:    

Similar News