లేటెస్ట్ అప్డేట్ :ఒక్క రోజే వెయ్యికి పైగా మరణాలు - 64,553 కేసులు

Update: 2020-08-14 06:45 GMT
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో వెయ్యి మందికి పైగా మరణించారు. మ‌రోసారి ఒకే రోజు 60 వేల‌కు పైగా కేసులు న‌మోదు అయ్యాయి. భారత్‌ లో 24 గంటల్లో 64,553 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 1007 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 24,61,191కు చేరగా - మృతుల సంఖ్య మొత్తం 48,040 కి పెరిగింది. ఇక 6,61,595 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 17,51,556 మంది కోలుకున్నారు.  ఈ లెక్కన మన దేశంలో సగటున గంటకు 2,689 మంది కరోనా బారినపడుతున్నారు. ప్రతి గంటకు 41 మంది మరణిస్తున్నారు.

కాగా, నిన్నటి వరకు మొత్తం 2,76,94,416 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిన్న ఒక్కరోజులో 8,48,728 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది. మొత్తం కేసుల పరంగా చూస్తే అత్యధికం మహారాష్ట్రలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఏపీ ఉన్నాయి.

తెలంగాణలో ప్రాణాంతక కరోనా వైరస్ జోరు కొనసాగుతోంది.  నిన్న ఒక్క రోజే ఏకంగా 1,921 మంది కరోనా  బారినపడడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 88 వేల మార్కును దాటేసింది. నిన్న 22,046 శాంపిళ్లు పరీక్షించగా 1,921 మందికి పాజిటివ్ ‌గా నిర్ధారణ అయినట్టు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ లో వెల్లడించింది. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 88,396కు పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 9,996 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 82 కరోనా మరణాలు సంభవించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,64,142కి చేరింది. అలాగే, ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,378కి పెరిగింది. రాష్ట్రంలో కరోనా నుంచి 1,70,924 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 90,840 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 21,072,125 మందికి కరోనా మహమ్మారి సోకింది. వీరిలో 13,924,328 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇక 757,471 మంది మరణించారు. అత్యధికంగా అమెరికా లో 5,415,666 మంది కరోనా భారిన పడ్డారు.
Tags:    

Similar News