ట్రంప్ కు షాకిచ్చేందుకు రెఢీ అవుతున్న అమెరికా

Update: 2017-01-30 05:27 GMT
అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ కు అమెరికా షాకివ్వటం ఏమిటి?  అందుకు రెఢీ కావటం ఏమిటన్న డౌట్ రావొచ్చు. కానీ.. మొత్తం చదివితే విషయం పూర్తిగా అర్థం కావటమే కాదు.. అమెరికాలో తాజా పరిస్థితి ఎలా ఉందో తెలిసిపోతుంది. అధ్యక్ష పదవిని చేపట్టిన వారం వ్యవధిలోనే అమెరికాతోపాటు.. ప్రపంచ దేశాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ట్రంప్ నిర్ణయాలపై స్వదేశంలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఆయన తీసుకుంటున్న వివాదాస్పద  నిర్ణయాలపై అమెరికన్లు మండిపడుతున్నారు. ఆయన తీరుకు వ్యతిరేకంగా నిరసనలు..ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్ విధించిన నిషేధంపై అమెరికన్లు తీవ్ర నిరసన వ్యక్తంచేయటమే కాదు.. ఎయిర్ పోర్ట్ లలోనూ ఆందోళన చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ట్రంప్ నిర్ణయం చెల్లదంటూ.. తాత్కాలికంగా నిలిపివేస్తూ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు..  అదే స్ఫూర్తిగా మరిన్ని వ్యవస్థలు ట్రంప్ పై పోరుకు సిద్ధమవుతున్నాయి.

ట్రంప్ తీసుకునే వివాదాస్పద.. ఏకపక్ష నిర్ణయాల్ని అడుగడుగునా అడ్డుకునేందుకు దిశగా పలు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. అమెరికా లాంటి ఫెడరల్ సిస్టంలో తమ రాష్ట్రాలు.. తమ ప్రజల హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమ మీద ఉందని వారు చెబుతున్నారు. ట్రంప్ ఆదేశాల్ని గుడ్డిగా అమలు చేసే అవకాశమే లేదని తేల్చి చెబుతున్నారు.

ఈ మధ్యన న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో మాట్లాడుతూ.. ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలను అడ్డుకునేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయని.. ఆయన వివాదాస్పద నిర్ణయాల్ని తాముఅడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. ఇలాంటి మాట న్యూయార్క్ గవర్నర్ ఒక్కరే కాదు.. అమెరికాలోని పలు రాష్ట్రాల పాలకులు చెబుతున్నారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఫెడరల్ న్యాయసూత్రాలకు పూర్తి విరుద్ధంగా వారు చెబుతున్నారు. ఒకవేళ తమ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా నిర్ణయాలు తీసుకుంటే.. తాము కోర్టులకు వెళతామని.. అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందన్న ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.చూస్తుంటే.. ట్రంప్ కు చుక్కలు చూపించే కార్యక్రమాన్ని బయట వారు కాక.. అమెరికన్లే మొదలు పెట్టారని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News