ఆ విష‌యంలో త‌గ్గేదేలే అంటోన్న‌ జ‌గ‌న్‌...!

Update: 2022-11-17 10:30 GMT
175కు 175 సీట్లు రావాల్సిందే.. ఇదేమంత కొత్త కూడా కాదు! ఇదీ.. ప‌దేప‌దే జ‌గ‌న్ చెబుతున్న మాట‌. ఆయ‌న దృష్టిలో ఇది పెద్ద‌ది కాక‌పోవ‌చ్చు. కానీ, క్షేత్ర‌స్తాయిలో నాయ‌కుల‌కు మాత్రం ఈ రేంజ్‌లో సీట్లు సాధించ‌డం అంటే.. తేలికేనా? అనే సందేహం నెల‌కొంది. గ‌త ఎన్నిక‌ల్లో 151 సీట్లు వ‌చ్చాయి.

అంటే.. అది పాద‌యాత్ర కావొచ్చు.. వైఎస్ పాల‌న తిరిగి వ‌స్తుంద‌నే ఆశాభావం కావొచ్చు. ఎలా చూసుకున్నా.. అది సాధ్య‌మైంది. అదేస‌మ‌యంలో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ పార్టీలు ఎవ‌రికి వారుగా పోటీ చేయ‌డం కూడా.. వైసీపికి క‌లిసి వ‌చ్చింది.

అయితే, రోజులు అన్నీ ఒకే విధంగా ఉండ‌వు క‌దా! ఇదే ఇప్పుడు వైసీపీలో చ‌ర్చ‌కు దారితీస్తోంది. పైగా.. మూడున్న‌రేళ్ల పాల‌న అనంతరం.. ప్ర‌భుత్వం పై వ్య‌తిరేక‌త రాకుండా ఉంటుందా? అనేది కూడా వైసీపీ నేత‌లు చెబుతున్న మాట‌. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ చెబుతున్న 175/175  రావాలంటే.. అంత ఈజీకాద‌నేది నేత‌ల మధ్య చ‌ర్చ‌గా మారింది. ఇదిలావుంటే, జిల్లాల వారీగా చూసినా.. ప్ర‌తి జిల్లాలోనూ 5 నుంచి ఆరు నియోజ‌క‌వ‌ర్గాల్లో మిశ్ర‌మ ఫ‌లిత‌మే వినిపిస్తోంది. ఇక‌, అదేస‌మ‌యంలో ప్ర‌తి జిల్లాలోనూ.. ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గెలుపు ఖాయం అనే మాట ఉంది.

అంటే.. మొత్తంగా చూస్తే.. ప్ర‌స్తుతం ఉన్న 26 జిల్లాల్లో.. ప్ర‌తి జిల్లాకు హీన‌ప‌క్షంగా.. రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త ఉంద‌ని అనుకున్నా 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ గెలుపు గుర్రం ఎక్క‌ద‌నే అంచ‌నాలు వున్నాయి.

మ‌రి.. ఇలాంటి కీల‌క అంశాన్ని వ‌దిలేసి.. కేవ‌లం మ‌నం ప్ర‌జ‌ల‌కు ఏదో చేస్తున్నాం.. ప్ర‌తి ఇంట్లోనూ సంక్షేమం అందుతోంది.. కాబ‌ట్టి.. మ‌న‌కు 175 స్థానాలు కూడా ద‌క్కాల‌నే పిడివాదాన్ని వినిపించ‌డంపై నాయ‌కులు గంద‌ర‌గోళం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు కోరుకుంటున్న డిమాండ్ల‌ను ప‌రిశీలించి ప‌రిష్క‌రించాల‌ని కోరుతున్నారు.

ప్ర‌ధానంగా ప్ర‌జ‌లు ప‌న్నులు త‌గ్గించాల‌ని కోరుతున్నారు. చెత్త‌ప‌న్నుపై సైలెంట్ వార్ న‌డుస్తోంది. దీనిని తీసేయాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు. ర‌హ‌దారుల దుస్థితి కొన‌సాగుతోంది. అదేస‌మ‌యంలో ధ‌ర‌ల ద‌రువు నుంచి త‌మ‌ను కాపాడాల‌ని కూడావారు కోరుతున్నారు. ఇవే విష‌యాల‌పై వైసీపీ నాయ‌కులుసైతం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.కానీ, ఈ విష‌యాన్ని వ‌దిలేసిన జ‌గ‌న్‌.. కేవ‌లం, 175 అంకెను మాత్రం ప‌ట్టుకుని వేలాడ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని సీనియ‌ర్లు అభిప్రాయ‌ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News