శాంతి ప‌ల‌కాల్సిన చోటా...కత్తులు దూశారుగా!

Update: 2017-09-05 04:50 GMT
మ‌న‌మంతా ఐరాస‌గా పిలుచుకునే... ఐక్య‌రాజ్య‌స‌మితి ఉద్దేశ‌మే ప్ర‌పంచ శాంతిని కాపాడ‌టం. ఏ ఇరు దేశాలు యుద్ధ స‌న్నాహాలు మొద‌లెట్టినా... ముందుగా రంగంలోకి దిగేది ఐరాస‌నే. ఆయా దేశాల మ‌ధ్య రాయ‌బారం న‌డిపి... యుద్ధం జ‌ర‌గ‌కుండా త‌న‌వంతు య‌త్నాలు చేయ‌డంలో ఇప్ప‌టిదాకా ఐరాస చాలా విజ‌యాల‌నే సాధించింద‌ని చెప్పాలి. ఒక్క ఇరాక్ యుద్ధం మిన‌హా మిగిలిన ప్ర‌తి సంద‌ర్భంలోనూ ఐరాస జోక్యంతో అప్ప‌టిదాకా క‌త్తులు దూసిన దేశాలు శాంతి బాట ప‌ట్టిన వైనం మ‌నంద‌రికీ తెలిసిందే. ప్ర‌పంచ శాంతి ప‌రిర‌క్ష‌ణే ధ్వేయంగా ఏర్ప‌డిన అలాంటి ఐరాస‌లో వార్ సీన్ అంటే దాదాపుగా దుస్సాధ్య‌మే. అయితే ఆయా దేశాల‌కు పాల‌కులుగా మారుతున్న యువ నేత‌ల దుందుడుకు వైఖ‌రి కార‌ణంగా ఐరాస‌లోనూ వార్ సీన్లు క‌నిపించ‌డం ఇప్పుడు యావ‌త్తు ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది.

అయినా ఐరాస‌లో వార్ సీన్ ఎందుకు క‌నిపించింద‌న్న విష‌యానికి వ‌స్తే... ఉత్త‌ర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ అగ్ర‌రాజ్యం అమెరికాపై ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా? అంటూ కాసుకుని కూర్చున్నాడు. అయితే ఐరాస‌లో కీల‌క భూమిక పోషిస్తున్న దేశం హోదాలో కిమ్ స‌వాల్ విసురుతున్నా కూడా అమెరికా కాస్తంత నిగ్ర‌హంగానే ఉంటోంది. ఈ క్ర‌మంలో మొన్న కిమ్ హైడ్రోజ‌న్ బాంబును ప్ర‌యోగించ‌డంతో అమెరికాకు కూడా స‌హ‌నం నశించిన‌ట్లుగానే క‌నిపిస్తోంది. హైడ్రోజన్ బాంబు ప్ర‌యోగంతో ఒక్క‌సారిగా హిరోషిమా - నాగ‌సాకిల దుస్థితిని గుర్తు చేసుకున్న ఐరాస వెనువెంట‌నే రంగంలోకి దిగిపోయింది. ఐరాస‌లో కీల‌క విభాగ‌మైన భ‌ద్ర‌తా మండ‌లిని అత్య‌వ‌స‌రంగా స‌మావేశ‌ప‌ర‌చింది. ఈ స‌మావేశానికి అమెరికా స‌హా భ‌ద్ర‌తా మండలిలోని శాశ్వ‌త స‌భ్య దేశాల హోదాలో ర‌ష్యా - చైనా త‌దిత‌ర దేశాలు కూడా హాజ‌ర‌య్యాయి.

స‌మావేశం సాఫీగా సాగుతున్న స‌మ‌యంలో చైనాతో పాటు ర‌ష్యా చేసిన కామెంట్లు ఒక్క‌సారిగా వేడిని పుట్టించాయి. కిమ్‌ జోలికి వ‌స్తే... చూస్తూ ఉరుకునేది లేదంటూ ఆ రెండు దేశాలు అమెరికాకు కాస్తంత గ‌ట్టిగానే హెచ్చ‌రిక‌లు జారీ చేశాయి. అప్ప‌టిదాకా కాస్తంత స్థిమితంగానే కూర్చున్న అమెరికా ప్ర‌తినిధి నిక్కీ హేలీ ఒక్క‌సారిగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ... యుద్ధ స‌న్నాహాలు చేస్తున్న కిమ్‌ ను నిలువ‌రించే ప‌నిని వ‌దిలేసి... అత‌డి దాడి నుంచి త‌మ దేశ ప్ర‌జ‌ల‌ను ర‌క్షించుకునేందుకు ప‌థ‌కం ర‌చిస్తున్న త‌మకే హెచ్చ‌రిక‌లు జారీ చేస్తారా? అంటూ ఒంటికాలిపై లేచారు. అయినా కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మాటలతో వినే రకం కాదని, యుద్ధాన్నే కోరుకుంటున్నాడని ఐరాసలో అమెరికా రాయబారిగా స‌మావేశానికి హాజ‌రైన‌ నిక్కీ హేలీ అన్నారు.

‘‘కిమ్‌ జాంగ్‌ ఉన్‌ యుద్ధం కోసం యాచిస్తున్నారు(బెగ్గింగ్‌ ఫర్‌ వార్‌). ఐక్యరాజ్య సమితి ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నే ఉన్నారు. ఇప్పటికే ఆరు సార్లు అణుపరీక్షలు చేశారు. ఇప్పటికైనా మనం ‘అతణ్ని దారికి తేవాలనే’  ఆలోచన వీడుదాం. తీవ్ర చర్యలు తీసుకునే దిశగా నిర్ణయం తీసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి.. అమెరికా పైకి - అమెరికన్ల పైకి కొన్ని వందల బాంబులు గురిపెట్టి కూర్చుంది కొరియా. ఇలాంటి పరిస్థిలో మేం సహనంతో ఉండలేం. యుద్ధం మా వాంఛకాదు. కానీ మా భద్రత విషయంలో ఎంత దూరమైనా వెళతాం’’ అని  హేలీ ఏర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా క‌ల‌గ‌జేసుకున్న చైనా ప్ర‌తినిధి లూజీ... *ప్రస్తుత పరిస్థితి విషవలయంలా మారింది. కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని - అణువ్యాప్తి తగ్గింపు విషయంలో అంతర్జాతీయ సమాజం ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా మేం ఉత్తరకొరియాను అభ్యర్థిస్తూనేఉన్నాం. అయితే, కొరియాను అణ్వాయుధాలు వదులుకోవాలని డిమాండ్‌ చేస్తోన్న అమెరికా తనకుతానుగా ఆ పని చేస్తోందా? అని ప్రశ్నించుకోవాలి. కొరియాపై ఆంక్షలను ఇంకా కఠినతరం చేయాలన్న ఆలోచననుగానీ, ఆ దేశంపై యుద్ధం చేయాలన్న ప్రణాళికలనుగానీ చైనా - రష్యాలు ముమ్మాటికీ సమర్థించబోవు. కొరియా ద్వీపంలో శాంతి నెలకొనాల్సిందే. అది జరగాలంటే ముందుగా అమెరికా - దాని అనుబంధ దేశం దక్షిణకొరియాలు వెనక్కితగ్గాలి. ఉత్తరకొరియాను చుట్టుముట్టి భయపెట్టిస్తున్న తీరును మార్చుకోవాలి. మీరు గట్టిపడేకొద్దీ వాళ్లూ గట్టిపడతారు* అని కాస్తంత క‌టువుగానే స‌మాధానం ఇచ్చార‌ట‌.

లూజీ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్ధిస్తూ ర‌ష్యా ప్ర‌తినిధి కూడా మాట క‌ల‌ప‌డంతో మ‌రింత ఆగ్ర‌హం వ్యక్తం చేసిన హేలీ... కొరియా విషయంలో సాధ్యమైనన్ని శాంతియుత మార్గాలన్నీ విఫలమయ్యాయని, ఐరాస 10 సార్లు హెచ్చరించినా వారు వినిపించుకోవడం లేదని, కిమ్‌ లాంటి యుద్ధపిపాసిని అడ్డుకోవాలంటే తీవ్ర చర్యలకు ఉపక్రమించడం తప్ప వేరే దారి లేదని నిక్కీ హేలీ ముక్తాయింపునిచ్చారు. దీంతో శాంతిని నెల‌కొల్పేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల కోసం స‌మావేశ‌మైన ఐరాస‌లో నిజంగానే వార్ సీన్ ప్ర‌త్య‌క్ష‌మైంది.
Tags:    

Similar News