అతడి గుండె ఆమెకు పెట్టారు

Update: 2015-12-11 03:53 GMT
ఒక అరుదైన శస్త్రచికిత్స హైదరాబాద్ నిమ్స్ లో జరిగింది. దాదాపు పదేళ్ల తర్వాత నిమ్స్ వైద్యులు గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఒక బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి గుండెను.. హృద్రోగ సమస్యలతో బాధ పడుతున్న ఒక మహిళకు అమర్చారు. ఇందుకోసం 20 మంది వైద్యులు దాదాపు ఏడున్నర గంటల పాటు శ్రమించి ఈ ఆపరేషన్ ను పూర్తి చేశారు. ఈ ఉదంతంలో.. డాక్టర్ల ప్రతిభతో పాటు.. మూర్తీభవించిన మానవత్వ కోణాలు కనిపిస్తాయి.

కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ కు చెందిన 30 ఏళ్ల ఓంలత గత కొద్ది నెలలుగా తీవ్ర ఆయాసంతో బాధపడుతున్నారు. ఆమెకు పరీక్షలు జరిపిన వైద్యులు ఆమె గుండె పూర్తిగా దెబ్బ తిన్నట్లు గుర్తించారు. మందులు.. ఆపరేషన్ తో సాధ్యం కాదని.. గుండె మార్పిడి అవసరమని తేల్చారు. ఇందుకోసం రూ.11లక్షలు అవసరమని చెప్పగా.. అంత ఖర్చు పెట్టలేని ఆమె.. సీఎంఆర్ఎఫ్ జీవన్ దాన్ లో తన పేరును నమోదు చేసుకున్నారు. ఆసుపత్రిలో ఆడ్మిట్ అయ్యారు. ఇదిలా ఉండగా వరంగల్ జిల్లా హుజురాబాద్ సమీపంలో అదిలాబాద్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల వినయ్ కుమార్ ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అతనికి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తీసుకొచ్చారు.

అయితే.. ఆ యువకుడి బ్రెయిన్ డెడ్ అయిన విషయాన్ని తెలపటం.. అవయువ దానం గురించి అతని తల్లిదండ్రులకు చెప్పారు. వారు అందుకు అంగీకరించటంతో.. అతని గుండెను.. ఓంలతకు అమర్చారు. దీని కోసం పోలీసుల్ని సంప్రదించిన వైద్యులు.. గ్రీన్ ఛానల్ఏర్పాటు చేసి.. సికింద్రబాద్ లో ఉన్న గుండెను నిమ్స్ కు 7 నిమిషాల సమయంలో తరలించారు. ఇక.. నిమ్స్ వైద్యులు దాదాపు 20 మంది ఏడున్నర గంటలు శ్రమించి గుండె మార్పిడి ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. మరో 48 గంటల తర్వాత ఓం లతకు స్పృహ వస్తుందని వైద్యులు చెబుతున్నారు. మానవత్వంతో ఒకరి త్యాగం.. వైద్యుల శ్రమ.. పోలీసుల సహకారం వెరసి.. ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టినట్లైంది.
Tags:    

Similar News