అశ్వత్థామరెడ్డి సెలవు అడిగితే ఏం చెప్పారో తెలుసా?

Update: 2019-12-21 07:03 GMT
ఈ మధ్యన దీర్ఘకాలంగా సాగిన ఆర్టీసీ సమ్మెకు ముందు వరకూ అశత్థామరెడ్డి అంటే పెద్దగా తెలీదు. సమ్మె కారణంగా ఆయన భారీగా హైలెట్ అయ్యారు. ఆ మాటకు వస్తే.. సమ్మెకు కారణంగా కేసీఆర్ తో అశ్వత్థామరెడ్డికి చెడటమే అన్న మాట ప్రచారం ఉంది. దీనికి కారణం లేకపోలేదు. అసలు అశ్వత్థామరెడ్డిని పెంచి పెద్ద చేసి.. లీడర్ ను చేసింది కూడా కేసీఆరే అని చెబుతారు. తర్వాతి కాలంలో ఇరువురి మధ్య వచ్చిన మనస్పర్థలు భారీ సమ్మెకు కారణం కావటమే కాదు.. పలువురు ప్రాణాలు పోయేలా చేసింది.

వేలాది మంది కార్మికులకు నాయకుడైన అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ ఎంప్లాయి అయినా..  ఆయన చేయాల్సిన ఉద్యోగం చేయలేని పరిస్థితి. కార్మికసంఘ నేతగా కీలకభూమిక పోషిస్తున్న వేళ.. రోజువారీగా నిర్వర్తించాల్సిన విదులు నిర్వర్తించరు. ఆ మాటకు వస్తే.. యూనియన్లు ఉన్న చాలా సంస్థల్లో ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులుగా తాము చేయాల్సిన పని చేయరు.అందుకు అశ్వత్దామరెడ్డి సైతం మినహాయింపు కాదు.

సమ్మె సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలపై కేసీఆర్ కత్తి కట్టటం.. వారి ప్రమేయం లేకుండా ఉద్యోగులతో మాట్లాడటం లాంటివి తెలిసిందే. అంతేకాదు.. రానున్న రోజుల్లో ఆర్టీసీలో యూనియన్లు అనేవి ఉండవని కూడా తేల్చారు కూడా. ఇదిలా ఉంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అశ్వత్థామరెడ్డి పని చేయలేని పరిస్థితి. అందుకే.. తనకు ఆర్నెల్లు సెలవు కావాలంటూ లీవ్ లెటర్ రాసిచ్చారు.

తన లీవుపై ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సమాధానంతో అశ్వత్థామరెడ్డి అవాక్కు అయ్యే పరిస్థితి. ఆయనకు సెలవు ఇవ్వలేమని.. సంస్థ ఆర్థిక సంక్షోభంలో ఉందంటూ రిజెక్ట్ చేశారు. ఆ విషయాన్ని నోటీసు బోర్డుపై అతికించారు. మామూలుగా అయితే ఎవరైనా ఉద్యోగి లీవు అడిగితే.. అందుకు నో చెప్పాల్సి వస్తే.. సదరు ఉద్యోగికే నేరుగా చెబుతారు. కానీ.. అందుకు భిన్నంగా నోటీసు బోర్డు మీద పెట్టటం ద్వారా ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. సమ్మె సమయంలో తాము పని చేసిన నెలకు జీతాలు ఇవ్వాలంటే ఆర్థిక సంక్షోభంతో సాధ్యం కాదని చెప్పటం మర్చిపోలేం. సమ్మె విరమణ తర్వాత తనకు ఓకే అనుకున్నంతనే నిధులు విడుదల చేసిన కేసీఆర్ కు తగ్గట్లే.. ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్థిక సంక్షోభం పేరుతో సెలవు రిజెక్టు చేయటం ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News