పుట్టింటికి వెళ్లి ఎంతకూ తిరిగి రాకుంటే విడాకులే

Update: 2016-10-02 06:18 GMT
కోపంతో కావొచ్చు.. మనస్పర్థ కారణంగా కావొచ్చు... భార్య పుట్టింటికి వెళితే.. భర్త ఏం చేయాలి? భార్యను ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా.. ఫ‌లితం లేకుంటే భర్త పరిస్థితి ఏమిటి? భార్యభర్తల మధ్య చోటు చేసుకునే స్పర్థల వ్యవహారంలో పుట్టింటికి వెళ్లే భార్యల విషయానికి సంబంధించి ఆసక్తికర తీర్పు ఒకటి తాజాగా హైకోర్టు ఇచ్చింది. కండీషన్స్ అప్లై అన్నట్లుగా సాగే ఈ ఉదంతంలో.. పుట్టింటికి వెళ్లి ఎంతకూ తిరిగి రాని భార్యలతో విడాకులే అన్నట్లుగా ఉన్న ఈ ఉదంతం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నిజామాబాద్ కు చెందిన బ్రహ్మానందం అనే వ్యక్తి 1982లో రమాదేవి అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. అనంతరం వీరికి ఒక కొడుకు.. కూతురు పుట్టారు. పెళ్లి అయిన పదమూడేళ్ల తర్వాత అంటే.. 1995లో భర్తకు చెప్పకుండా రమాదేవి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య ఎంతకు తిరిగి రాని పరిస్థితి. దీంతో.. బ్రహ్మానందం విడాకుల కోసం ప్రయత్నించారు. అయితే.. ఈ కేసును విచారించిన ఫ్యామిలీ కోర్టు విడాకులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో.. పిటీషనర్ హైకోర్టును ఆశ్రయించారు.

తనకు తన భార్యతో విడాకులు ఇప్పించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ అంశాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు..  పుట్టింటికి వెళ్లిన భార్య.. తిరిగి రాకపోవటం.. భర్త వద్దకు రాకపోవటానికి సరైన కారణాల్ని చూపించలేని నేపథ్యంలో.. దీర్ఘకాలం వేర్వేరుగా ఉన్న భార్యభర్తలు తిరిగి కలిసే అవకాశం లేనప్పుడు వారికి విడాకులు మంజూరు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందుకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ.. విడాకులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సో.. పుట్టింటికి వెళ్లే భార్యలు.. దీర్ఘకాలం తిరిగి రాకున్నా.. కారణాలు చూపకుండా విడిగా ఉన్నా విడాకుల ప్రమాదం పొంచి ఉన్నట్లేనన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News