జీఈఎస్ లో నో ప్రోటోకాల్‌

Update: 2017-11-27 05:43 GMT
ఇప్పుడు అంద‌రి దృష్టి మొత్తం గ్లోబ‌ల్ ఆంత్ర‌ప్రెన్యూర్ షిప్ స‌మ్మిట్ మీద‌నే ఉంది. మ‌రో రోజులో (మంగ‌ళ‌వారం) ప్రారంభ‌మ‌య్యే ఈ అంత‌ర్జాతీయ స‌ద‌స్సు కోసం తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుందో తెలిసిందే. ఈ స‌ద‌స్సు జ‌రిగే హెచ్ ఐసీసీ ప‌రిస‌ర ప్రాంతాల్లో చేసిన సుంద‌రీకీక‌ర‌ణ‌.. ఏర్పాట్ల‌ను చూస్తే ముక్క‌న వేలేసుకోవాల్సిందే. ఏ మాట‌కు ఆ మాటే.. మ‌నోళ్ల‌కు చేయ‌టం రానిదంటూ  ఏమీ ఉండ‌దు. కావాలంటే రోడ్ల‌ను అద్దంలా మార్చేయ‌ట‌మే కాదు.. కిలోమీట‌ర్లు కిలోమీట‌ర్లు కొద్దీ.. కొత్త కాంతుల‌తో ధ‌గ‌ధ‌గ‌లాడేలా చేయ‌గ‌ల‌ర‌ని నిరూపించారు.

అయితే.. ఈ ఏర్పాట్లు చూస్తే ఒళ్లు మండేది ఎందుకంటే.. అధికారం చేతికి అందించిన ప్ర‌జ‌ల కోసం కాకుండా అమెరికా నుంచి వ‌చ్చే అధ్య‌క్షుల వారి కుమార్తె కోసం ఇంత భారీగా ఏర్పాట్లు చేస్తే.. ప్ర‌భుత్వాలు ఉన్న‌ది ప్ర‌జ‌ల కోస‌మా? అమెరికా అధ్య‌క్షుడి కూతురు కోస‌మా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

దీన్ని ప‌క్క‌న పెడితే.. ఈ స‌ద‌స్సుకు సంబంధించిన ఒక ఆస‌క్తిక‌ర అంశం వెలుగులోకి వ‌చ్చింది. ఈ స‌ద‌స్సును కేంద్రం నిర్వ‌హిస్తోంది. ప్ర‌ధాని మోడీ ముఖ్య అతిధిగా పాల్గొనే ఈ స‌ద‌స్సులో  నో ప్రోటోకాల్ పేరుతో న‌లుగురైదుగురికి త‌ప్పించి మిగిలిన వారంద‌రికీ ఆహ్వానాలు ఎత్తిపారేయ‌టం విశేషం. సాధార‌ణంగా అంత‌ర్జాతీయ స‌ద‌స్సు జ‌రిగిన‌ప్పుడు.. స్థానిక న‌గ‌రానికి చెందిన ముఖ్య‌నేత‌ల్ని ఆహ్వానించ‌టం క‌నిపిస్తుంది. మిగిలిన వారి సంగ‌తి ఎలా ఉన్నా.. న‌గ‌ర ప్ర‌థ‌మ పౌరుడు (మేయ‌ర్‌)కి ఆహ్వానం త‌ప్ప‌క ఉంటుంది.

కానీ.. నో ప్రోటోకాల్ పేరుతో మేయ‌ర్ తో పాటు.. మిగిలిన నేత‌లంద‌రికి ఈ స‌ద‌స్సులో పాల్గొనేందుకు ఉన్న అవ‌కాశాల్ని ఎత్తిపారేశారు. అదేమంటే.. గ‌తంలో నిర్వ‌హించిన జీఈఎస్ లోనూ నో ప్రోటోకాల్ ను అమ‌లు చేశార‌ని.. ఈ కార‌ణంతోనే ఇప్పుడు కూడా అదే విధానాన్ని అమ‌లు చేస్తున్న‌ట్లు చెబుతున్నారు.

మామూలుగా అయితే.. ప్రోటోకాల్ ప్ర‌కారం భారీ లిస్టు త‌యార‌వుతుంది. వీరంద‌రిని జీఈఎస్ స‌ద‌స్సుకు పిల‌వాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా నో ప్రోటోకాల్ పేరుతో రెగ్యుల‌ర్ గా పిలవాల్సిన అతిధులంద‌రికి ఆహ్వానాలు పంప‌కుండా ఎత్తిపారేసిన  ధోర‌ణి క‌నిపిస్తుంది. నో ప్రోటోకాల్ కార‌ణంగా హైద‌రాబాద్ న‌గ‌ర మేయ‌ర్ తో స‌హా.. తెలంగాణ రాష్ట్ర సర్కారుకు చెందిన ముఖ్య నేత‌ల్ని.. అధికారుల్ని ఈ స‌ద‌స్సుకు దూరంగా ఉంచ‌నున్నారు.

మ‌రి.. ఈ స‌ద‌స్సుకు తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు త‌ర‌ఫున హాజ‌ర‌య్యేది ఎవ‌ర‌య్యా అంటే.. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌.. మ‌రో ఇద్ద‌రు.. ముగ్గురు ముఖ్య అధికారులు (ఇందులో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి జ‌యేశ్ రంజ‌న్ త‌ప్ప‌క ఉంటార‌నుకోండి) మాత్ర‌మే పాల్గొంటార‌ని తెలుస్తోంది.  ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించే అంత‌ర్జాతీయ స‌ద‌స్సులో స్థానిక భాగ‌స్వామ్యం అన్న‌ది లేకుండా చేయ‌టం విశేషంగా చెప్పాలి. ఇక్క‌డో చిన్న విష‌యాన్ని చెప్పాలి. ఏ స్థానిక సెంటిమెంట్‌ను అస్త్రంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిందో.. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్ గెలిచారో.. ఇప్పుడు అదే స్థానిక‌త‌ను నో ప్రోటోకాల్ పేరుతో ఎత్తిపారేయ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News