87 ఏళ్ల మాజీ సీఎం చేసిన పని తెలిస్తే.. ఆ సినిమా గుర్తుకొస్తుంది

Update: 2022-05-11 13:30 GMT
అభిషేక్ బచ్చన్ నటించిన దస్వీ మూవీ చూశారా? థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది. రాజకీయ నేతలకు చదువు ఎంత ముఖ్యమన్న విషయాన్ని చెబుతూనే.. వినోదాత్మకంగా సాగే ఈ సినిమా సీరియస్ సందేశాన్ని ఇస్తుంది. ఎనిమిదో తరగతి చదివిన ముఖ్యమంత్రి అనూహ్యంగా జైల్లోకి రావటం.. అక్కడ తన చిరకాల వాంఛ అయిన పదో తరగతిని పూర్తి చేయాలనుకోవటం.. నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవటం.. మొత్తంగా సినిమా మొదలైనప్పటి నుంచి చివరకు వరకు కదలకుండా కూర్చునేలా చేస్తుంది.

చివరకు కథానాయకుడు తన స్వప్నమైన పదో తరగతి పాస్ అయ్యాడు.. జైలు నుంచి విడుదలైన తర్వాత సీఎం అయ్యాడా? లాంటి ప్రశ్నలు సినిమాలో వచ్చేస్తాయి. తాజాగా ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఈసినిమాలో మాదిరి సీన్లే ఉండటం ఆసక్తికరమని చెప్పాలి. హర్యానా మాజీ ముఖ్యమంత్రి.. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు.

87 ఏళ్ల వయసులో ఉన్న ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రిగా పని చేసి ఉండటం..  అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లి రావటం తెలిసిందే. మొదట చెప్పిన సినిమాలోమాదిరే జైలుకు వెళ్లిన సమయంలో చౌతాలా తన పదో తరగతి పరీక్షను రాశారు. 2019లో తీహార్ జైల్లో ఉన్నప్పుడు రాసిన పదో పరీక్షలో ఇంగ్లిషు ఎగ్జామ్ రాయలేదు. దీంతో.. అది మినహా మిగిలిన సబ్జెక్టులు క్లియర్ అయ్యాయి.

తాజాగా హర్యానా ఓపెన్ బోర్డు 2021లో నిర్వహించిన 12 తరగతి పరీక్ష రాసిన చౌతాలా రిజల్ట్ ను ఆపేశారు. దీనికి కారణం ఆయన పదో తరగతి పరీక్షలో ఇంగ్లిషు సబ్జెక్టు క్లియర్ కాకపోవటమే. దీంతో గత ఆగస్టులో ఆయన తన పదో తరగతి పరీక్షలో పెండింగ్ ఉన్న ఇంగ్లిషు సబ్జెక్టు ఎగ్జామ్ రాశారు. తాజాగా ఆ ఫలితాలు వచ్చాయి.

80ప్లస్ ఏజ్ లో ఆయన రాసిన పదో తరగతి పరీక్షలో పాస్ కావటమే కాదు.. నూటికి 88 మార్కులు తెచ్చుకోవటం గమనార్హం. ఇంగ్లిషు సబ్జెక్టు క్లియర్ అయ్యాక.. ఆయన రాసిన పన్నెండో తరగతి పరీక్షా ఫలితాల్ని ప్రకటించారు. అందులోనూ ఆయన పాస్ అయినట్లుగా పేర్కొన్నారు. ముదిమి వయసులోనూ పట్టుదలతో పరీక్ష రాసిన ఈ మాజీ ముఖ్యమంత్రిని అభినందించాల్సిందే.
Tags:    

Similar News