బీజేపీకి కానీ మ‌రో 6730 ఓట్లు వ‌చ్చి ఉంటేనా?

Update: 2018-05-18 07:20 GMT
కొన్నిసార్లు అంకెలు ఎంత చికాకుగా అనిపిస్తాయో.. మ‌రికొన్నిసార్లు అంతే గ‌మ్మ‌త్తుగా మారుతుంటాయి. ఇప్పుడు చెప్ప‌బోయే లెక్క కూడా అలాంటిదే. 6730 ఓట్లు అంటే పెద్ద లెక్క‌లోదే కాదు. ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి ఆ ఓట్లు.. అందునా బీజేపీ లాంటి పార్టీకి అయితే అదో పెద్ద లెక్క కాదు. కానీ.. కేవ‌లం స్వ‌ల్ప ఓట్ల తేడానే క‌ర్ణాట‌క రాజ‌కీయం ఇప్పుడు చిత్ర‌విచిత్ర‌మైన మ‌లుపులు తిర‌గ‌ట‌మే కాదు.. బీజేపీకి కొత్త త‌ల‌నొప్పుల్ని తెచ్చి పెట్టింది.

ఒక‌వేళ క్లియ‌ర్ మెజార్టీ రాకున్నా.. ఇప్పుడు వ‌చ్చిన‌ట్లుగా 104 సీట్లు రాకున్నా బాగుండేది. మెజార్టీకి కేవ‌లం ఎనిమిది సీట్లు మాత్ర‌మే తేడా ఉన్న‌ప్పుడు.. ఏ రాజ‌కీయ పార్టీకైనా ఆశ పుడుతుంది. ఏదోలా అధికారాన్ని చేజిక్కించుకోవాల‌నిపిస్తుంది. అలాంటిదే బీజేపీకి క‌లిగింది. కాకుంటే.. బీజేపీ అంటే మండిప‌డే కాంగ్రెస్‌.. జేడీఎస్ లాంటి పార్టీలు ఉండ‌టంతో క‌మ‌ల‌నాథులకు ఇప్పుడు మ‌హా ఇబ్బందిక‌రంగా మారింది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. చాలా త‌క్కువ మెజార్టీల‌తో కాంగ్రెస్ ప‌లు స్థానాల్ని చేజార్చుకుంది. మ‌స్కీ నియోజ‌క‌వ‌ర్గంలో కేవలం 213 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఈ రీతిలో.. ఇప్పుడు బీజేపీకి అవ‌స‌ర‌మైన మెజార్టీ సీట్ల‌కు సంబంధించి ఓడిపోయిన ఓట్లు కేవ‌లం 6730 మాత్ర‌మే.ఒక‌వేళ ఈ ఓట్లు వ‌చ్చి ఉంటే.. మ‌రో తొమ్మిది స్థానాల్లో బీజేపీ పాగా వేసి ఉండేది. అప్పుడీ త‌ల‌నొప్పి అంతా మోడీ ప‌రివారానికి ఉండేది కాదు.
Tags:    

Similar News