అమరావతి మున్సిపాలిటీకి ఎదురుదెబ్బ.. మెగాసిటీకే ఓటు అన్న రైతులు

Update: 2022-09-18 04:31 GMT
మొన్నటివరకు మూడు రాజధానులపై జగన్ సర్కారు చేసిన ప్రయత్నాలకు ఏపీ హైకోర్టు చెక్ పెట్టిన వేళ ఏపీ సర్కారు మౌనంగా ఉండటం తెలిసిందే. అయితే.. ఆ మౌనం వ్యూహాత్మకమన్న విషయం తాజాగా వెలుగు చూడటమే కాదు.. మూడు రాజధానుల కాన్సెఫ్టును మళ్లీ తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. అదే సమయంలో.. ఏపీ రాజధాని అమరావతి పరిధిలో వచ్చే తుళ్లూరు మండలంలోని 19 గ్రామాలు.. మంగళగిరి మండలంలోని 3 మూడు గ్రామ పంచాయితీలు కలిపి మొత్తం22 గ్రామ పంచాయితీల్లో నిర్వహించిన గ్రామ సభలు శనివారంతో ముగిసాయి.

ఇందులో రాజధాని నగరంగా మెగా సిటీ నిర్మాణానికే తమ ఆమోదం తప్పించి.. గ్రామాల్ని విలీనం చేసి అమరావతి మున్సిపాటిగా ఏర్పాటు చేస్తామన్న తీర్మాన్నాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకంచారు. సీఆర్ డీఏ చట్టం ప్రకారం 29 గ్రామాలతో కూడిన మెగా సిటీని డెవలప్ చేయాల్సిందేనని స్పష్టం చేయటం గమనార్హం. ఇటీవల నిర్వహించిన గ్రామ సభలో శనివారంతో ముగిసాయి. అన్ని చోట్ల ఒకేలా.. మున్సిపాలిటీ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు.

శనివారం తుళ్లూరు మండలం శాఖమూరు.. నేలపాడు.. తుళ్లూరు పంచాయితీల్లో గ్రామ సభలు నిర్వహించగా.. శాఖమూరులో ప్రభుత్వ ప్రతిపాదనకు ఒకరు సమ్మతి తెలియజేయగా.. 37 మంది వ్యతిరేకించారు. ఇక.. నేలపాడు.. తుళ్లూరులలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. రాజధాని డెవలప్ చేస్తామంటే భూములు ఇచ్చామని.. మెగాసిటీ కాదని ఇప్పుడు మున్సిపాలిటీ ప్రతిపాదనను తాము ఎలా అంగీకరిస్తామని నేలపాడు రైతులు ప్రశ్నించటం గమనార్హం.

తమ హక్కుల్ని వదులుకునేది లేదని స్పష్టం చేసిన అమరాతి ప్రాంత రైతులు.. మరిన్ని ఆసక్తికర ప్రశ్నల్ని  సంధించారు.ఆ ప్రశ్నాస్త్రాల్ని చూస్తే..

-  అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధానిని డెవలప్ చేయలేమని చెప్పారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేనప్పుడు మున్సిపాలిటీని ఎలా డెవలప్ చేస్తారు?

-  మా పెద్దలుపచ్చడి మెతుకులు తిని సంపాదించిన భూములు రాజధాని కోసం ఇస్తే పిచ్చి మొక్కలు పెంచుతారా?

-  పదవుల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. జగన్మోహన్ రెడ్డి.. షర్మిలలు పాదయాత్ర చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పాదయాత్ర చేస్తే కేసులుపెట్టి అడ్డుకుంటారా?

-  శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు మాకు లేదా?

-  మూడు రాజధానులు పెడితే మేమేం కావాలి? మా పిల్లలు ఏం కావాలి?

కడుపు నిండా తిండి తినక.. కంటి నిండా నిద్ర పోక కాలం గడుపుతున్నామని.. కోర్టు ద్వారా పోరాడి తమ హక్కుల్ని సాధించుకుంటామన్న అమరావతి ప్రాంత మహిళలు.. గ్రామ సభల్ని నిర్వహించేందుకు వచ్చిన అధికారులతో తమ ఆలోచనల్ని స్పష్టంగా తెలియజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ప్రజల అభిప్రాయ సేకరణకు వచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. ఏమైనా.. అమరావతి రైతులు మరోసారి రాజధానిపై తమ ఆలోచనల్ని విస్పష్టంగా తెలియజేశారని చెప్పక తప్పదు. ఇంతలా వ్యతిరేకిస్తున్న వ్యవహారాన్ని జగన్ ప్రభుత్వం ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.
Tags:    

Similar News