తెలంగాణలో ‘కన్నడ’ ప్రచారం

Update: 2016-02-08 04:15 GMT
ఎన్నికలు వస్తే చాలు.. ఆకట్టుకోవటానికి ఎన్నో ఎత్తులు వేస్తుంటారు రాజకీయ నాయకులు. తామేం చేసినా ఓటర్ల మైండ్ సెట్ ను గెలుచుకుంటే.. ఓట్ల వర్షం కురవటం ఖాయమన్న సంగతి తెలిసిందే. అందుకే.. అన్ని రాజకీయ పక్షాలు ఓటర్ల మదిని గెలుచుకునేందుకు కిందామీదా పడుతుంటాయి. మొన్నటి మొన్న గ్రేటర్ ఎన్నికల సందడి పూర్తి అయితే.. తాజాగా మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో చారిత్రక విజయం అనంతరం టీఆర్ ఎస్ నేతలు.. శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాయి.

ఖేడ్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా పని చేస్తున్న పద్మా దేవేందర్ రెడ్డి తాజాగా చేసిన ప్రచారం ఆసక్తికరంగా మారింది. ఖేడ్ కు సరిహద్దులుగా ఉన్న కర్ణాటక.. మహారాష్ట్ర రాష్ట్రాలు ఉండటంతో.. ఇక్కడి ప్రజలు తెలుగుతోపాటు కన్నడ.. మరాఠీ మాట్లాడే వారు అధికంగా ఉంటారు. దీంతో.. ఆయా భాషలు మాట్లాడే వారి మదిని దోచుకునేందుకువీలుగా పద్మా దేవేందర్ రెడ్డి తన ప్రసంగాన్ని కన్నడంలోకి మార్చేసి అక్కడి వారికి స్వీట్ షాక్ ఇచ్చారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కన్నడంలో ఒకట్రెండు ముక్కలు మాట్లాడటం కాకుండా కొన్ని ప్రశ్నల్ని వేసి ఓటర్ల నుంచి సమాధానాలు చెప్పించుకోవటంలో పద్మా దేవేందర్ సక్సెస్ అయ్యారు. ఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎవరు చేశారని కన్నడంలో పద్మా దేవేందర్ అడిగితే.. కేసీఆర్ చేశారంటూ కన్నడంలో అక్కడి వారు సమాధానం ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి తెలంగాణలో కన్నడ రాజకీయ ప్రచారం ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
Tags:    

Similar News