ప్ర‌పంచ వ్యాప్తంగా ప్యార‌డైజ్ ప‌త్రాల ప్ర‌కంప‌న‌లు

Update: 2017-11-07 05:05 GMT
ఆ మ‌ధ్య‌న బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌నామా పేప‌ర్లు సృష్టించిన ప్ర‌కంప‌న‌లెన్నో. తాజాగా అంత‌కు మించి అన్న రీతిలో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌ముఖుల గుట్టుమ‌ట్ల‌ను.. విదేశాల్లోని కంపెనీల చీక‌టి బండారాల్ని బ‌య‌ట‌పెట్టింది ప్యార‌డైజ్ ప‌త్రాలు. ప‌న్నుఎగ‌వేత‌కు చ‌ట్ట‌విరుద్ధంగా విదేశాల్లో పెట్టుబ‌డులు పెట్టిన వైనాన్ని తాజాగా విడుద‌లైన ప్యార‌డైజ్ ప‌త్రాలు బ‌య‌ట‌పెట్టాయి. దీంతో.. ప్యార‌డైజ్ ప్ర‌పంచ వ్యాప్తంగా పెను సంచ‌ల‌నంగా మారింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కులు.. సెల‌బ్రిటీలు.. సినీ తార‌లు.. సంప‌న్నులు.. బ‌హుజాతి కంపెనీలు.. ట్ర‌స్టులు.. డొల్ల కంపెనీలు త‌మ సంప‌ద‌ను  ప‌న్నుపోటు నుంచి త‌ప్పించేందుకు విదేశాల్లో పెట్టుబ‌డులు పెట్టారు. వీటికి సంబంధించిన స‌మాచారం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అమెరికా.. ఇంగ్లాండ్‌.. ర‌ష్యా.. పాక్ లాంటి దేశాల‌కు చెందిన వారే కాదు.. మ‌న‌దేశానికి చెందిన 700 మందికి పైగా వ్య‌క్తుల పేర్లు ఈ ప‌త్రాల్లో ఉన్నాయి. మోడీ స‌ర్కారులో కేంద్ర మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌యంత్ సిన్హాతో పాటు ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు అమితాబ్‌.. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త విజ‌య్ మాల్యా.. కొర్పారేట్ ద‌ళారిగా పేరున్న నీరారాడియా.. హైద‌రాబాద్‌ కు చెందిన హెటెరో డైరెక్ట‌ర్లు వెంక‌ట న‌ర‌సారెడ్డి.. పార్థ‌సార‌థి రెడ్ల‌తో పాటు.. ప‌లువురిపేర్లు ప్యార‌డైజ్ ప‌త్రాల్లో ఉన్న విష‌యం బ‌య‌ట‌కువ‌చ్చింది. ఇలా పెద్ద ఎత్తున పేర్లు ప్యార‌డైజ్ ప‌త్రాల్లో బ‌య‌ట‌కు రావ‌టంతో కేంద్ర‌ప్ర‌భుత్వం  ఈ ఉదంతంపై విచార‌ణ‌కు ఆదేశించింది.

45 మీడియా సంస్థ‌ల భాగ‌స్వామ్యంతో వేర్వేరు దేశాల్లో శోధించి.. 1.34 కోట్ల లీకైన ప‌త్రాల్ని ప‌రిశీలించిన అంత‌ర్జాతీయ ప‌రిశోధ‌నాత్మ‌క పాత్రికేయుల స‌మాఖ్య ప్యారడైజ్ పేప‌ర్ల పేరిట విడుద‌ల చేసింది. ప్యార‌డైజ్ ప‌త్రాలు భార‌త్ తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల్లో రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించింది. న‌ల్ల‌ధ‌నానికి వ్య‌తిరేక దినానికి రెండు రోజుల ముందు బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ ప‌త్రాలు మోడీ స‌ర్కారుకు ఇబ్బందిగా మారాయి. ఇదిలాఉంటే.. ప్యార‌డైజ్ ప‌త్రాల్లో బ‌య‌ట‌కు వ‌చ్చిన కేంద్ర‌మంత్రి జ‌యంత్ సిన్హా.. బీజేపీ ఎంపీ ఆర్కే సిన్హాలు రాజీనామా చేయాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

ప్యార‌డైజ్ ప‌త్రాల్లో వెల్ల‌డైన పేర్ల‌లో చాలావ‌ర‌కూ గ‌తంలో బ‌య‌ట‌కు వ‌చ్చిన కుంభ‌కోణాల్లోని వారున్నారు. యాపిల్‌.. నైకీ.. ఉబ‌ర్ లాంటి సుమారు వంద‌కు పైగా బ‌హుళ‌జాతి సంస్థ‌ల పన్ను ప్ర‌ణాళిక‌ల వివ‌రాల్ని ప్యార‌డైజ్ ప‌త్రాలు బ‌య‌ట‌కు తెచ్చాయి. చ‌ట్ట‌బ‌ద్దంగా చెల్లించాల్సిన ప‌న్ను మొత్తాన్ని చెల్లించ‌కుండా విదేశాల్లో అక్ర‌మంగా పెట్టుబ‌డులు పెట్టిన వైనం తాజా ఉదంతంలో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అలా బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌ముఖులు చూస్తే..

+ కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా

+ అమితాబ్‌ బచ్చన్‌

+ భాజపా ఎంపీ ఆర్‌ కే సిన్హా

+  దిల్‌ నాషిన్ అలియాస్ మాన్యతా దత్ (బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ భార్య)

+ జిఖిత్జా హెల్త్‌ కేర్‌ లిమిటెడ్‌

+ నీరా రాడియా

+ విజయ్‌ మాల్యా

+ ఫిట్జీ (ప్ర‌ముఖ కోచింగ్ సంస్థ‌)

+  అమెరికా వాణిజ్యమంత్రి విల్బర్‌ రాస్‌

+ బ్రిటిష్‌ రాణి ఎలిజబెత్‌

+ కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రుడో

+ కెన‌డా ప్ర‌ధాని సన్నిహితుడు స్టీఫెన్‌ బ్రాన్ఫ్‌ మన్‌

+ పాకిస్థాన్‌ మాజీ ప్రధాని షౌకత్‌ అజీజ్‌

+  మైక్రోసాప్ట్‌ సహవ్యవస్థాపకుడు పాల్‌ అలెన్‌

+ ఈ బే వ్యవస్థాపకుడు పియరీ ఒమిద్యార్‌

+ పాప్‌ దిగ్గజం మడొన్నా

+  అమెరికా విదేశాంగమంత్రి రెక్స్‌ టిల్లర్‌ సన్‌

+ 2004లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫు అమెరికా అధ్యక్ష అభ్యర్థి వెస్లీ క్లార్క్

+ అమెరికా మాజీ వాణిజ్య మంత్రి పెన్నీ ప్రిట్క్జర్‌

+ జోర్డాన్‌ మాజీ రాణి నూర్‌ అల్‌ హుసేన్‌

+ బ్రిటన్‌ మాజీ వాణిజ్యమంత్రి జేమ్స్‌ మేయర్‌ సాసూన్‌

+ సౌదీ అరేబియా మాజీ రక్షణ ఉపమంత్రి ప్రిన్స్‌ ఖలీద్‌ బిన్‌ సుల్తాన్‌ బిన్‌ అబ్దులజీజ్‌

+ కెనడా మాజీ ప్రధానులు జీన్‌ క్రిస్టీన్‌ - పాల్‌ మార్టిన్‌ - బ్రెయిన్‌ ముల్రోనీ

+ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు సన్నిహితులైన 10 మందితో పాటు ప‌లువురున్నారు.
Tags:    

Similar News